Raksha Bandhan 2021 : అన్నా చెల్లెళ్ల రక్షాబంధన్‌లో అందమైన కధలెన్నో..

Raksha Bandhan 2021 : అన్నా చెల్లెళ్ల రక్షాబంధన్‌లో అందమైన కధలెన్నో..
Raksha Bandhan 2021 : అన్నా చెల్లెళ్ల అనుబంధం.. ఆత్మీయ సుగంధం.. అక్కకి పక్కన తమ్ముడు ఉంటే భరోసా.. కంటికి రెప్పలా కాపాడుకుంటాడని చెల్లెలికి అన్నంటే చెప్పలేనంత ప్రేమ.

Raksha Bandhan 2021 : అన్నా చెల్లెళ్ల అనుబంధం.. ఆత్మీయ సుగంధం.. అక్కకి పక్కన తమ్ముడు ఉంటే భరోసా.. కంటికి రెప్పలా కాపాడుకుంటాడని చెల్లెలికి అన్నంటే చెప్పలేనంత ప్రేమ. ప్రేమకు ప్రతి రూపాలు అక్కా తమ్ముళ్లు.. అన్నా చెల్లెళ్లు.. వారి అనుబంధానికి ప్రతీక ఈ రక్షాబంధన్. సోదరుడికి ప్రేమతో కట్టే రాఖీ వారి మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను మరింత మెరుగు పరుస్తుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం సోదరి తన సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టి అతని శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంది. సోదరుడు ఆమెకు బహుమతి ఇచ్చి అండగా నిలుస్తానని వాగ్దానం చేస్తాడు. భారతదేశంలోని ఇతర పండుగల మాదిరిగానే, రక్షా బంధన్ చరిత్ర కూడా వివిధ పౌరాణిక ఇతిహాసాల మేళవింపుతో, జానపద కథలతో ముడిపడి ఉంటుంది. కథలెన్నో ఉన్నా కొన్నింటిని గురించి తెలుసుకుందాం.

అసురులు, దేవతల మధ్యం యుద్దం జరుగుతోంది. దేవతల రాజైన ఇంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోతున్న దశలో గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్లి అసురల నుంచి రాజ్యాన్ని కాపాడుకునే మార్గం అడుగుతాడు. అప్పడు బృహస్పతి శ్రావణ పూర్ణిమ నాడు మీ మణికట్టును ఓ పవిత్రమైన దారంతో ముడి వేయమని సలహా ఇస్తారు. ఇంద్రుని భార్య ఇంద్రాణి భర్త చేతికి రక్ష అనే పవిత్ర దారాన్ని కట్టి దేవతలకు విజయం ప్రాప్తించాలని ఆశీర్వదిస్తుంది. ఇది దేవుళ్ల విజయానికి దారితీసింది. రక్షా బంధన్.. ఒక మహిళ తన భర్త మణికట్టుకు దారం కట్టడంతో ప్రారంభమైందా అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది.

ద్రౌపది మరియు కృష్ణ:

ఐదుగురు పాండవులకు భార్య అయిన ద్రౌపది శ్రీకృష్ణుడుని సోదరుడిగా భావిస్తుంది. మకర సంక్రాంతి నాడు కృష్ణుడుకి తన చిటికెన వేలు తెగి రక్తం కారుతుంది. అది చూసిన ద్రౌపది తన చీర కొంగులోని చివరి భాగాన్ని కత్తిరించి అతని వేలికి కడుతుంది. ప్రతిగా, కృష్ణుడు ఆమెను రక్షిస్తానని హామీ ఇస్తాడు. అన్నట్టుగానే నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమెకు శ్రీకృష్ణుడు సహాయం చేస్తాడు.

రోక్సానా మరియు కింగ్ పోరస్

క్రీస్తుపూర్వం 326 లో అలెగ్జాండర్ భారతదేశంపై దాడి చేసినప్పుడు, అతని భార్య రోక్సానా.. పౌరస్ రాజు అయిన పోరస్‌‌కు పవిత్రమైన దారం పంపి, యుద్ధభూమిలో తన భర్తకు హాని చేయవద్దని కోరింది. యుద్ధంలో, పోరస్ తన మణికట్టు మీద ఉన్న రాఖీని చూసి అలెగ్జాండర్‌పై దాడి చేయకుండా తనను తాను నిగ్రహించుకున్నాడు.

రవీంద్రనాథ్ ఠాగూర్ vs బెంగాల్ విభజన

1905 లో, బెంగాల్ విభజన జరిగినప్పుడు, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రాఖీ మహోత్సవాలను ప్రారంభించారు. బెంగాల్‌లోని హిందువులు, ముస్లింల మధ్య ప్రేమ, ఐక్యతను బలోపేతం చేశారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని ఆయన వారిని కోరారు. ఆయన చెప్పినట్లుగా నడుచుకున్నారు బెంగాలీయులు. పశ్చిమ బెంగాల్‌లో రాఖీ కట్టడం అనే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

రక్షా బంధన్ వేడుకలు వేద యుగంలో ప్రారంభమైనా కానీ ఈ సంప్రదాయాన్ని దేశంలో సోదర సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తున్నారు. సాధారణ రాఖీల నుండి విదేశాలలో ఉన్న సోదరులకు పంపించే ఆధునిక ఇ-రాఖీల వరకు రక్షా బంధన్ బాగా అభివృద్ధి చెందింది. బంధాలను బలోపేతం చేస్తూనే ఉంది. కాలం మారుతున్న కొద్దీ, సోదరీమణులు తమ తోబుట్టువులకు రాఖీలు కట్టడం మాత్రమే కాదు, కొంతమంది తమకు తాము ధరించడం కూడా కనిపిస్తుంది.

పురుషుడు లేదా స్త్రీ, పట్టింపు లేదు.. ప్రతి రక్షకుడు రాఖీకి అర్హుడు.. మొదటి రాఖీని ఎవరు కట్టారు అనేది ఎవరికి తెలియని రహస్యం కావచ్చు. కానీ రక్షాబంధన్ ఓ సంతోష సంబరం. పండుగ ఏదైతేనేమి పదిమంది కుటుంబ సభ్యులు కలిస్తే ఆ ఇల్లు ఆనందాల హరివిల్లవుతుంది. అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు!

Tags

Read MoreRead Less
Next Story