వైభవంగా అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

వైభవంగా అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు పాల్గోని స్వామివారిని దర్శిస్తున్నారు.

కర్నూలు జిల్లా అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా జరుగుతున్నాయి. ఎగువ అహోబిలంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అశేష భక్తజనం మధ్య జ్వాలా నృసింహస్వామి, చెంచులక్ష్మీ అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ కళ్యాణం జరిపారు. అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీరంగరాజ యతీంద్ర మహాదేశికన్‌ ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు పాల్గోని స్వామివారిని దర్శిస్తున్నారు.

ఇటు అనంతపురం జిల్లా కదిరిలోనూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న స్వామివారు సింహ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ హనుమంతవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవింద నామ స్మరణతో మార్మోగింది.

అలాగే నవ నారసింహక్షేత్రాల్లో ఒక్కటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకునింది. స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉగ్ర నృసింహ స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. నృసింహస్వామివారితో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున స్వామివారి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను జిల్లా కలెక్టర్‌ సమర్పించారు. స్వామి అమ్మవార్లను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సతీమణి దర్శించుకున్నారు. కోవిడ్‌ దృష్ట్య అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


Tags

Next Story