రథసప్తమి వేడుకలకు సిద్ధమైన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం
శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి దేశంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కోనార్క్ తర్వాత రెండవ సూర్యనారాయణ స్వామి దేవాలయం కావటంతో ఈ ఆలయానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ఆరోగ్య ప్రధాతగా కొలిచే సూర్య భగవానుణ్ని దర్శించుకుంటే ఎలాంటి కష్టాలు ఉండవనేది భక్తుల నమ్మకం. ఇంతటి ప్రసిద్ది చెందిన అరసవెల్లి ఆలయం.. రధసప్తమి వేడుకలకు సిద్దమయ్యింది.
ఈ యేడాది రదసప్తమి వేడుకలు కోసం దేవాదాయ శాఖ రెండు నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించింది. వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. 18 వ తేదీ అర్ధరాత్రి నుంచే ఆలయానికి బక్తులు తాకిడి పెరిగే అవకాశ ఉన్నందున ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వి.ఐ.పిలు, దాతలకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు. ఈ యేడాది సుమారు 60 వేల మంది వరకూ భక్తులు రధసప్తమి వేడుకలకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు..
సూర్య జయంతి రోజున స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని ఆలయ ఈఓ హరి సూర్యప్రకాష్ తెలిపారు. స్వచ్ఛంధ సంస్దల సహకారంతో క్యూలైన్లలోని భక్తులకు పాలు, మంచినీరు అందే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. స్వామి వారి దర్శనం అనంతరం భక్తులందరికీ ప్రసాదాలు అందే విధంగా ముందు నుంచే లడ్డూలు సిద్దమౌతున్నాయి.
మాగ శుద్ద సప్తమి సందర్భంగా అరసవెల్లిలో ప్రతి యేటా సూర్య జయంతిని నిర్వహిస్తారు. రధసప్తమి రోజు భాస్కరుని దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. 19 వ తేదీ వేకువజామున స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం.. విశాఖ శారధాపీఠాధిపతి వేడుకలకు అంకురార్పన చేస్తారని ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ తెలిపారు. 19 వ తేదీ ఉదయం నుంచి భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం ఉంటుందని చెప్పారు.
అరసవెల్లిలో ప్రతి యేటా భక్తులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈసారి ఎటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com