హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే.. ఆధారాలతో రుజువు చేసేందుకు సిద్ధమైన టీటీడీ..!
హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే..! ఇప్పుడీ నిజాన్ని శాస్త్రీయంగా ఆధారాలతో సహా నిరూపించేందుకు TTD సిద్ధమైంది. ఇవాళ శ్రీరామ నవమి సందర్భంగా.. ఇప్పటి వరకూ సేకరించిన ఆధారాల్ని భక్తుల ముందు ఉంచబోతోంది. కాసేపట్లో నాదనీరాజనం వేదికపై నుంచి ఆంజనేయుడి బాల్యానికి సంబంధించి, అంజనాద్రిపై మారుతి ఆనవాళ్ల గురించి వివరాల్ని వెల్లడించబోతోంది. ఇప్పటి వరకూ దొరికిన శాసనాలు, అందుబాటులో ఉన్న పురాణాలు, ఇతర శాస్త్రీయ ఆధారాల్ని బట్టి TTD ఈ ప్రకటన చేయబోతోంది.
మారుతి జన్మస్థలాన్ని ధృవీకరించేందుకు, సాక్ష్యాల్ని అధ్యయనం చేసేందుకు గతేడాది డిసెంబర్‌లోనే కమిటీ ఏర్పాటు చేశారు. ఉగాది రోజే ఆ వివరాలు వెల్లడించాలి అనుకున్నా.. ఇతర రాష్ట్రాల్లోనూ మారుతికి సంబంధించిన జన్మవృత్తాంత ఆధారాలు ఉన్నాయని అభ్యంతరాలు రావడంతో ఆ వివరాల్ని పరిశీలించేందుకు సమయం తీసుకున్నారు. చివరికి అన్నీ చూసిన తర్వాత రాములోరి కల్యాణం రోజునే ఆయన బంటుకు సంబంధించిన జన్మస్థలం వివరాల్ని టీటీడీ సవివరంగా చెప్పబోతోంది.
అటు, శ్రీరామ నవమి సందర్భంగా ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇక.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ హనుమంత వాహనంపై శ్రీవారు తిరుమాడవీధుల్లో విహరిస్తారు. రాత్రి 8 గంటలకు బంగారువాకిలిలో శ్రీరామపట్టాభిషేక మహోత్సవం కూడా కమనీయంగా జరపనున్నారు. రాత్రి 10 గంటలకు శ్రీవారి ఆలయ బంగారువాకిలిలో శ్రీరామ నవమి ఆస్థానం కూడా ఉంటుంది. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో.. ఈ కార్యక్రమాల్ని పరిమిత సంఖ్యలో పండితులు, TTD ఉద్యోగుల సమక్షంలో నిర్వహించబోతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com