Kamakhya Temple: కోరిన వరాలిచ్చే కామాఖ్య.. ఆషాఢమాసంలో అమ్మవారికి బ్లీడింగ్
Kamakhya Temple: కొన్ని వినడానికి చాలా వింతగా ఆశ్యర్యంగా అనిపిస్తుంటాయి. మనుషుల మాదిరిగా విగ్రహాలు కూడా ప్రవర్తిస్తాయంటే ఆ దేవుని మహిమే అని భక్తులు విశ్వసిస్తారు. స్త్రీలకు రుతుక్రమం ప్రకృతి సిద్ధంగా జరిగే ప్రక్రియ.. అదే మాదిరిగా కామాఖ్య అమ్మవారికి కూడా జరుగుతుండడం వింతగా అనిపించే నమ్మలేని నిజం.
కామాఖ్య దేవాలయం భారతదేశంలోని అస్సాం రాష్ట్రం గౌహతిలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో గౌహతిలోని నీలాచల్ కొండపై ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ధూమావతి, మాతంగి, బాగోలా, తార, కమల, భైరవి, చిన్నమస్తా, భువనేశ్వరి, త్రిపురా సుందరి అని కాళీ మాత యొక్క మరో 10 ఇతర అవతారాలు ఉన్నాయి. ఆలయంలో దేవి విగ్రహం కానీ చిత్రపటం కానీ లేదు. కానీ ఆలయంలోని గుహ మూలలో దేవత యొక్క యోనికి సంబంధించిన శిల్ప చిత్రం ఉంది.
పౌరాణిక చరిత్ర..
కామాఖ్య ఆలయం గురించి ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. ఇది 108 శక్తి పీఠాలలో ఒకటి. శక్తి పీఠాల కథను ఒకసారి పరిశీలిస్తే.. ఒకసారి సతీదేవి తన తండ్రి దక్షుడు చేస్తున్న మహా యజ్ఞానికి వెళతానంటుంది.. పిలవకపోతే ఎలా వెడతావు అని భర్త శివుడు భార్యని వద్దని వారిస్తాడు.. అయినా సతీదేవి తన భర్త శివునితో పోరాడింది.
శివుడు అంగీకరించనప్పటికీ, సతీదేవి తన తండ్రి దక్షుడు నిర్వహించే 'యజ్ఞం'కి వెళ్లింది. శివుడిని ఆహ్వానించకపోగా, వచ్చినందుకు కూతురు సతీదేవిని కూడా దక్షుడు దుర్భాషలాడాడు. అవమానం భరించలేక సతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన భార్య ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో సతీదేవి మృత దేహాన్ని భుజాలపై వేసుకుని తాండవం చేశాడు.
అతడిని శాంతింపజేయడానికి, విష్ణువు తన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ముక్కలు చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన 108 ప్రదేశాలను శక్తి పీఠాలు అంటారు. సతీదేవి యొక్క యోని భాగం ఇక్కడ పడినందున కామాఖ్య ఆలయం ఈ ప్రత్యేకతను సంతరించుకుంది.
కామాఖ్య దేవాలయం శివుడు, సతీదేవిల శృంగారభరితమైన ప్రదేశమని కొందరు భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆ ప్రాంతానికి కామాఖ్య అని పేరు పెట్టారు.
ఆలయ చరిత్ర..
ఈ ప్రదేశానికి సంబంధించిన మొదటి ఆనవాళ్లు సముద్రగుప్త చక్రవర్తి అలహాబాద్ శాసనాల నుండి కనుగొనబడింది. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 1665లో కూచ్ బెహార్ రాజు నరనారాయణ్ నిర్మించారు. ప్రధాన ఆలయంలో ఏడు అండాకార గోపురాలు ఉన్నాయి.
రక్తస్రావం దేవత:
కామాఖ్యా దేవి రక్తస్రావం దేవతగా ప్రసిద్ధి చెందింది. ఆషాఢ మాసంలో అమ్మవారికి రుతుస్రావం అవుతుంది. ఈ సమయంలో, ఆలయ సమీపంలోని బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారుతుంది. ఆ సమయంలో ఆలయం 3 రోజుల పాటు మూసివేయబడుతుంది. నాల్గవ రోజున భక్తుల రాకపోకలతో ఆలయం మళ్లీ కోలాహలంగా మారుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com