తెలంగాణ శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు

తెలంగాణ శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రంలో చెర్వుగట్టు 'శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి' దేవాలయం సుప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది.

తెలంగాణ శ్రీశైలం, దక్షిణ కాశీగా పేరు గాంచిన.. 'చెర్వుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి' బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. శుక్రవారం కళ్యాణోత్సవంతో వేడుకలు ప్రారంభమై.. 24న గ్రామోత్సవంతో ముగియనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో అతిపెద్ద దేవాలయంగా పేరొందిన చెర్వుగట్టు.. ఈ ఏడాది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది.

తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది..నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు 'శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి' దేవాలయం. స్వామివారికి ఏటా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 19న నల్గొండలో నగరోత్సవంతో వేడుకలు ప్రారంభిస్తారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. చెర్వుగట్టు గుట్టపైన 20న రాత్రి.. కోనేటి పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లను హంస వాహనంపై తెప్పోత్సవం జరుపుతారు. 21న రాత్రి అగ్ని గుండాలు, 22న అశ్వవాహనసేవ, 23న పుష్పోత్సవం, ఏకాంతసేవలు, 24న గ్రామోత్సవం నిర్వహిస్తారు. గజ వాహనంపై చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో స్వామివారి ఊరేగింపుతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఉత్సవాలకు హాజరై.. తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి సుమారు 5లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కల్యాణం, అగ్నిగుండాలు, హంస వాహన సేవల్లో.. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. జాతరకు వచ్చే భక్తుల కోసం నార్కట్‌పల్లి, నల్గొండ, యాదగిరిగుట్ట, సూర్యాపేట, దేవరకొండ, కోదాడ డిపోలు ప్రత్యేక బస్సులు నడుపనున్నాయి. నార్కట్‌పల్లి డిపో నుంచి నల్లగొండకు వెళ్లే అన్ని బస్సులు.. చెర్వుగట్టు మీదుగా వెళ్తాయని అధికారులు చెబుతున్నారు.

చెర్వుగట్టు జాతరకు.. శతాబ్దాల చరిత్రే ఉంది. కేవలం 200 మీటర్ల ఎత్తులోని కొండపై గుహలో.. శివుడు స్వయంభుహుగా వెలసాడని ప్రతీతి. స్వామిని దర్శించుకోడానికి.. రెండు భారీ బండరాళ్ల మధ్య నుంచి వెళ్లడం ఇక్కడ ప్రత్యేకత. కొండ చివర ఉన్న 3 గుండ్ల మధ్య ఇరుకైన దారి నుంచి శివశివ అనుకూంటూ నడుస్తే.. బాధలు పోతాయని భక్తుల విశ్వాసం. మరోవైపు... ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. స్వామివారిని దర్శించుకుంటున్నారు.

అత్యంత ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతున్న చెరువుగట్టులో నిర్వహించే జాతరకు వచ్చే భక్తుల సంఖ్య.. ఏటా పెరుగుతోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, కంట్రోల్‌ రూమ్‌, ఔట్‌ పోస్ట్‌ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు. కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story