
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజున నేడు దుర్గమ్మ శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ మహాచండీ అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు మిత్రులుగా మారి కోరికలు అన్ని సత్వరమే తీరుతాయని భక్తుల నమ్మకం. సింహం భుజములపై భీషణంగా కూర్చొని తన ఎనిమిది చేతుల యందు వివిధ రకాల ఆయుధాలను దరించి, రాక్షస సంహారం గావించి లోక కళ్యాణం జరిపించిన దివ్యమైన రూపంతో భక్తులను బంగారు రంగు చీరలో సాక్షాత్కరిస్తుంది. ఈ రోజున చండీ పారాయణం, చండీ యాగం చేస్తారు. చండీ దేవిగా దర్శనమిచ్చే జగన్మాత కనకదుర్గమ్మకు ఈ రోజున నైవేద్యంగా తెల్ల నువ్వులు కలిపిన బెల్లం పొంగలి, వడలు నివేదిస్తారు.
మహా చండీ దేవి అలంకార విశిష్టత
చండుడు, ముండుడు అనే రాక్షసులను సంహరించిన కారణంగా అమ్మవారికి చాముండేశ్వరి దేవిగా పేరు వచ్చింది. దేవీ భాగవతం ప్రకారం చాముండేశ్వరి దేవిని కొలిచేటువంటి వారికి గ్రహ పీడలు తొలుగుతాయని శాస్త్రం చెబుతుంది. చాముండేశ్వరి దేవి ఆరాధన వలన, మానసిక రోగాలు, పిశాచ భయాలు తొలగిపోతాయి. అలాగే మానసిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com