GANESH VISARJAN: పైన పూల వర్షం...కింద భక్త జన సంద్రం

ముంబై మహా నగరంలో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా సాగింది. ముంబై రోడ్లు గణేశుల శోభాయాత్రతో కిక్కిరిసిపోయాయి. పెద్ద సంఖ్యలో బొజ్జ గణపయ్యలు గంగమ్మను చేరనున్నారు. వినాయక నిమజ్జనాలకు సంబంధించి బీఎంసీ కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. వినాయకుల నిమజ్జనం కోసం కొన్ని లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. సముద్రంతో పాటు చెరువులు, నీటి కుంటలు, కృత్తిమంగా తయారు చేసిన కుంటల్లో వినాయకులను నిమజ్జనం జరిగింది. ముంబై ప్రధాన వీధులు, రహదారులపై భారీ గణపతి విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనం చేశారు. మార్గమధ్యలో గణనాథులపై విమానంతో పూలవర్షం కురిపించారు. వినాయక శోభాయాత్రను వీక్షించేందుకు లక్షలాది మంది ప్రజలు రహదారులపైకి వచ్చారు. దీంతో పలు ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మరోవైపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. లక్షలాది మంది భక్తులు డప్పు మోతలకు డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు. లక్షల్లో భక్తులు పాల్గొన్న ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
కానుకగా కిలో బంగారు నెక్లెస్
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో గణనాథునికి కిలో బంగారు నెక్లెస్ను కానుకగా సమర్పించారు. దీని విలువ సుమారు రూ.కోటి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. భక్తుల నుంచి విరాళాల రూపంలో సేకరించిన నిధులతోనే హారాన్ని తయారు చేయించినట్టు తెలిపారు.
నిమజ్జనం కార్యక్రమంలో సీఎం
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో బొజ్జగణపయ్య నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ నివాసంలోనూ గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com