Kartika Somavaram: కార్తీక మాసం.. కార్తీక సోమవారం ఎంతో ప్రత్యేకం..

Kartika Somavaram: జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీకమాసం.
ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వలన ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు వచ్చింది.
మాసాలన్నింటిలోకి కార్తీక మాసం ప్రత్యేకమైనది. పరమశివుని పూజించే ప్రత్యేక మాసం ఇది. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు మరింత ప్రత్యేకమైనవి.
సోమవారం నాడు వేకువజామున లేచి స్నానాదికాలు ముగించుకుని దీపారాధన చేసిన వారికి, భగవంతుని పూజించి దానధర్మాలు చేసిన వారికి మోక్షం లభిస్తుందని అంటారు.
కార్తీక సోమవారం సూర్యోదయానికి ముందే బ్రహ్మీముహుర్తమున స్నానమాచరించి శివుణ్ణి స్తుతిస్తే పుణ్యం ప్రాప్తిస్తుంది. ఆవు నెయ్యితో కార్తీక దీపాన్ని వెలిగించడం మంచిది.
న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్
అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీకమాసానికి సమానమైన మాసం లేదు. శ్రీహహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం.
ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. ఈ మాసంలో ప్రతి రోజూ కార్తీక స్నానాలు ఆచరించడం సాధ్యం కాని ఆయా ప్రత్యేక దినాల్లో ఆచరించినా పుణ్యం లభిస్తుంది. ప్రతి నిత్యం ఉభయసంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది.
వనభోజనాల పేరుతో బంధువులు, స్నేహితులు కలిసి ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ఆనవాయితీ.
కార్తీకమాసంలో గంగా, గోదావరి, కావేరీ, తుంగభద్ర ఇత్యాది నదులలో స్నానం చేయడం అత్యుత్తమం. నదీస్నానానికి అవకాశం లభించకపోతే చెరువు దగ్గర కానీ, కూపము దగ్గర కానీ సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి.
సూర్యుడు అస్తమించే కాలంలో సాయం సంధ్యను పూర్తి చేసికొని శివాలయములో కానీ, విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయాలి.
కార్తీక సోమవారం రోజు శివుడికి అభిషేకం చేసి, బిల్వదళములతో సహస్రనామార్చన చేసి శివపంచాక్షరీ మంత్రాన్ని జపించిన పరమశివుడు సంతుష్టుడవుతాడు. సర్వసంపదలను, సమస్త శుభాలను చేకూరుస్తాడు.
కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడు సాయం సమయంలో శివాలయ ప్రాంగణంలో ఉసిరికాయపైన వత్తులు ఉంచి దీపం వెలిగించడం శ్రేష్టం. కార్తీకమాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం శుభాలు కలుగుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com