శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు

శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో మహాశివుణ్ని పూజిస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులతో హరిద్వార్‌ కిటకిటలాడుతోంది. ఇటు ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. విభూది, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. అలాగే గోరఖ్‌పూర్‌, నాసిక్‌లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని ప్రసిద్ధిగాంచిన పంచారామ క్షేత్రాల్లో మహాశివరాత్రిని ఘనంగా జరుపుతున్నారు. అమరావతి, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, సామర్లకోటలో గల పంచారామ ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ని పూజిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తి... లింగాకార రూపుడైన మహాశివుణ్ని దర్శిస్తున్నారు. కోవిడ్‌ దృష్ట్య ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. పువ్వులు, విద్యుత్‌ అలంకారంతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. స్వామివారికి లింగోద్భవకాల, మహారుద్రాభిషేకం, పాగాలంకరణ, కళ్యాణోత్సవం జరుగుతోంది. ఇవాళ సాయంత్రం శ్రీ భమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి వారికి ప్రభోత్సవం, నంది వాహన సేవలు నిర్వహించనున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి, అమ్మవార్లకు విశిష్ట అభిషేకాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మహాశివుడ్ని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణలో శ్రీశైలం క్షేత్రం మార్మోగుతుంది.

మహాశివరాత్రిని పురష్కరించుకుని.. రాజమండ్రి కోటిలింగాల ఘాట్‌లో శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పుష్కరఘాట్‌ దగ్గర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఘాట్‌ల దగ్గర దీపాలు పెట్టి మహాశివుణ్ని ప్రార్థించారు. శివనామస్మరణతో కోటిలింగాల ఘాట్‌ మార్మోగింది. భక్తుల కోలాహలంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story