Vijayawada: నవరాత్రుల సమయంలో ఇంద్రకీలాద్రిని దర్శించుకుంటే..

Vijayawada:విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. తొలిరోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు.
అమ్మవారిని స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శించుకోవడంతో సకల దారిద్యాలు తొలిగిపోయి సుఖసంతోషాలతో ఉంటామని భక్తుల నమ్మకం. ఆరోగ్య సిద్ధి, ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని పురాణ పండితులు చెబుతున్నారు. అష్టభుజాలతో సింహాసనం పైన త్రిశూలధారియై, కనకపు ధగధగలతో ఉన్న అమ్మవారిని చూసి భక్తులు తన్మయత్వానికి లోనవుతున్నారు.
ఇక అమ్మవారిని దర్శించుకోవడానికి రాత్రి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఉత్సవాల్లో రెండో రోజైన 8 వ తేదిన అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. మహాత్రిపుర సుందరీ.. నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్యాయంలో.. మొదటి దేవతని పండితులు చెప్తారు. మూడవరోజు గాయత్రీదేవిగా... 4 న లలితా త్రిపుర సుందరీ దేవిగా.. ఐదవరోజు అన్నపూర్ణాదేవిగా.. అదే రోజు సాయంత్రం మహాలక్ష్మి దేవిగా.. ఆరవరోజు సరస్వతి దేవిగా.. ఏడవరోజు దుర్గాదేవిగా.. 8 వరోజు మహిషాసురమర్థినిగా .. 9 వరోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
మరోవైపు ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కృష్ణానదిలో స్నానాల కోసం ప్రత్యేకంగా ఘాట్‌లను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజూ 10 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com