పార్లమెంట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

దేశంలో నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయ్యింది. ప్రారంభోత్సవం ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ నెల 28న మధ్యాహ్నాం 12 గంటలకు ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాతో కలిసి పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ నూతన భవనం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఆంగ్లేయుల నుంచి భారతీయులకు జరిగిన అధికార మార్పిడికి గుర్తుగా లార్డ్ మౌంట్‌బాటన్ నుంచి జవహర్‌లాల్ నెహ్రూ అందుకున్న రాజదండం ను లోక్‌సభలో ప్రతిష్ఠించనున్నారు. ఇది 5 అడుగులకు పైగా పొడవుతో, పైభాగంలో నంది చిహ్నంతో, బంగారుపూత కలిగిన వెండి దండం .
పార్లమెంటు నూతన భవన ప్రారంభంతో పాటు రాజదండం ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఈ నెల 28న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. పరిపాలనలో నీతి, న్యాయం, కర్తవ్యపథంలో సాగాలన్న సందేశాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే దీనిని లోక్‌సభలో ప్రతిష్టిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో ఉన్న సెంగోల్‌ను తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనం నుంచి వచ్చే వేదపండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించనున్నట్లు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com