నిరాడంబరంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

నిరాడంబరంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి జాతరపై కరోనా ఎఫెక్ట్ పడింది. జాతరలో ప్రధాన ఘట్టం సిరిమానోత్సవం కూడా నిరాడంబరంగా జరిగింది.. కరోనా నేపథ్యంలో భక్తులు..

ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి జాతరపై కరోనా ఎఫెక్ట్ పడింది. జాతరలో ప్రధాన ఘట్టం సిరిమానోత్సవం కూడా నిరాడంబరంగా జరిగింది.. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే జిల్లా అధికార యంత్రాంగం సిరిమానోత్సవం జరిపించింది. దీంతో ఆలయ పరిసర ప్రాంతమంతా బోసిపోయింది. ఈ సిరిమానోత్సవాన్ని భక్తులు ఇంటి నుండే వీక్షించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ సిరిమాను ను నాలుగవ సారి ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు అధిరోహించారు. ఆలయ ప్రాంగణం నుండి మొదలైన సిరిమానోత్సవం కోట మీదుగా పూసపాటి వంశీయుల బురుజు వరకు 3 రౌండ్లు సిరిమానును ఊరేగించారు.

కరోనా నేపథ్యంలో సిరిమానోత్సవం పటిష్ట భద్రత మధ్య సాగింది. విజయనగరం పట్టణం మొత్తం 144 సెక్షన్‌ అమల్లో ఉంది. అమ్మవారి ఆలయానికి వచ్చే అన్ని రహదారులను బారికేడ్లతో మూసివేశారు. భక్తులు అక్కడి రాకుండా ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. పట్టణంలోకి ఎవరూ రాకుండా, బయటకి వెళ్లకుండా ఆంక్షలు విధించిన అధికారులు.. 100కు పైగా సీసీ కెమెరాలతో పరిస్థితిని కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 4 వేల మందికి మాత్రమే జాతరలో పాల్గొనే అవకాశం కల్పించారు.

సిరిమానోత్సవం వీక్షణకు డీసీసీబి బ్యాంక్ దగ్గర మంత్రి బొత్సా సత్యనారాయణ దంపతలు, కోట పైన మాన్సస్ ఛైర్పెర్సన్ సంచైత గజపతిరాజు ఆశీనులై అమ్మవారి దర్శనం భాగ్యం పొందారు. అయితే వందల ఏళ్ల చరిత్రలో తొలిసారి భక్తులు లేకుండా ఉత్సవం జరగడంతో భక్తులు కొంత నిరాశలో ఉన్నారు. మరోవైపు సిరిమాను తొలి రౌండ్ పూర్తవగానే ఆనంద గజపతిరాజు కుటుంభ సభ్యులు సుధా, ఊర్మిలా గజపతిరాజులు వెనుదిరిగారు. మొదటి నుండి మాన్సస్ చైర్ పర్సన్ సంచైత గజపతికి, ఆనంద కుటుంబ సభ్యులకు విభేదాలే ఆ కుటుంభం వెనుదిరిగడానికి కారణంగా తెలుస్తుంది. భక్తులు లేకపోవడంతో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఏ ఆటంకం లేకుండా నిరాడంబరంగా పూర్తయింది. దీంతో ఈ ఏడాది త్వరగానే ఈ సిరిమాను ఉత్సవం కూడా ముగిసింది.

Tags

Read MoreRead Less
Next Story