Sravana Masam: ఆషాఢం ముగిసింది.. శ్రావణంలో శుభ ముహూర్తాలు..

Sravana Masam: ఆషాఢంలో ఆవిడకు దూరంగా ఉన్న వారంతా శ్రావణం కోసం ఎదురు చూస్తుంటారు.. ఈ రోజు నుంచే ప్రారంభమైన శ్రావణమాసం ఎంతో విశిష్టమైనది. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించే ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి రోజు మంచి రోజుగానే చెప్పుకున్నా కొన్ని రోజులు మాత్రం శుభకార్యాలకు అనుకూలంగా మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.
సెప్టెంబర్ 6 తో శ్రావణ మాసం ముగుస్తుంది. ఈ పవిత్ర మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలు ఊపందుకుంటాయి. మరి ఈ మాసంలో మంచి రోజులు ఏవో తెలుసుకుందాం.
నోములకు, వ్రతాలు, పెళ్లిళ్లు, పేరంటాలకు శ్రావణమాసం పెట్టింది పేరు. విశేషమైన పూజలు, వ్రతాలు భక్తి శ్రద్ధలతో జరుపుతుంటారు. ప్రధానమైన పండుగలు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతాయి. ఇంతటి విశిష్టత కలిగిన శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు మనకు అనుకూలంగా ఉన్నవి ఎంచుకుంటే మనో వాంఛ సిద్ధిస్తుందని పండితులు చెబుతుంటారు.
ఈనెల 12, 13 తేదీల్లో నాగుల చవితి, గరుడ పంచమి ఉన్నాయి. 14వ తేదీన లక్ష్మీ వెంకటేశ్వర వ్రతం, 15న నరసింహ వ్రతం. 20వ తేదీన వరలక్ష్మీ వ్రతం, 23న శ్రావణ పౌర్ణిమ, రాఖీ పర్వదినం ఇలా పండుగలన్నీ ఈనెలలో వస్తుంటాయి. ఇక ఈనెల 30వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి. సెప్టెంబర్ 7నుంచి భాద్రపదమాసం ప్రారంభమవుతుంది.
శుభకార్యాలు చేసుకునేందుకు ఈనెలలో మంచి రోజులంటే 11,13,15,18,20,22,25,27,31, సెప్టెంబర్ 1,4,5 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నాయని ప్రముఖ పండితులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com