Varalakshmivratam: శ్రావణమాస సౌభాగ్యం.. వరలక్ష్మీ వ్రతం

Varalakshmivratam: శ్రావణమాస సౌభాగ్యం.. వరలక్ష్మీ వ్రతం
Varalakshmivratam: శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ సంప్రదాయంలో ఆచారంగా వస్తున్న వ్యవహారం.

Varalakshmi Vratam: శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ సంప్రదాయంలో ఆచారంగా వస్తున్న వ్యవహారం. స్త్రీలు వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు.

సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీ దేవిగా కొలుస్తాం. అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మీ వత్రం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మికగ్రంథాలు పేర్కొంటున్నాయి.

జగన్మాత పార్వతీ దేవి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వత్రం ఏదైనా వుందా అన్ని పతి పరమేశ్వరున్ని అడిగింది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరిసంపదలు, సౌభాగ్యం లభిస్తాయని శివుడు ఆమెకు తెలిపాడు. దీనికి సంబంధించిన కథను పార్వతీదేవికి వివరంగా వినిపించాడు.

పూర్వం మగధ రాజ్యంలోని కుంది నగరంలో చారుమతి అనే వివాహిత వుండేది. ఆమెకు కలలో అమ్మవారు కనిపించి తన వ్రతాన్ని ఆచరించమని కోరింది. పొద్దున్నే తన స్వప్న వివరాలను కుటుంబసభ్యులకు తెలపడంతో వారు వ్రతాన్ని ఆచరించమని సూచించారు. పెద్దలు, కుటుంబసభ్యుల సహకారంతో చారుమతి వ్రతాన్ని ఆచరించింది.

శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ప్రాతఃకాలవేళలో స్నానపానాదులు ఆచరించి తోటి ముత్తయిదువులతో మండపంలో లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాన్ని ప్రతిష్టించి వ్రతం నిర్వహించింది. వ్రతం తరువాత ఆమె సకల సంపదలతో జీవితాన్ని కొనసాగించినట్టు ఈశ్వరుడు వ్రత వివరాలను పార్వతీదేవికి వివరించాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు వెల్లడించిన వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఈ శుభదినాన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు.

ఈ వ్రతం ఎందుకు చేస్తారు?

అష్ట లక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు.


సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

వ్రత విధి విధానం తొలుత పసుపు తో గణపతి ని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనమీయవలెను.

Tags

Read MoreRead Less
Next Story