RAMA NAVAMI: మానవ జీవిత మార్గదర్శకం.. రామాయణం

రామాయణం.... సీతారాముల దివ్యచరితం. వాల్మీకి విరచితమై... లవకుశల ప్రవచితమై... మధురవాజ్ఞయ మనోహరమై.. భక్తిభావనామృతమై... విరాజిల్లింది. ఏ కథను వింటే హృదయం ఆనందంతో నిండిపోతుందో.. ఏ కావ్యాన్ని కంటే సత్య స్వరూపం ఆవిష్కృతమవుతుందో.. ఏ ఇతిహాసాన్ని మళ్లీ మళ్లీ మననం చేసుకుంటే ధర్మం కరతలామలకం అవుతుందో.. అదే రామాయణం. రామాయణం అంటే, రాముడు నడిచిన దారి. అయోధ్య నుంచి లంక వరకూ సాగిన ప్రయాణమే రామాయణం. మానవ జాతికి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించే మంత్రపుష్పం రామాయణం. మానవ జీవిత మార్గదర్శక గ్రంథం రామాయణం.
దైవత్వమే ప్రకటించని సామాన్యుడు
శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడవ అవతారమే రామావతారం. త్రేతాయుగంలో మానవ రూపంలో అయోధ్యలో జన్మించిన శ్రీరాముడు ఎక్కడా తన దైవత్వాన్ని ప్రకటించలేదు. ఒక సాధారణ మానవుడు ఎదుర్కొనే ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటూ, ఎప్పుడూ ధర్మాన్ని, న్యాయాన్ని పాటిస్తూ అసత్యానికి పాల్పడలేదు. రాముడు తండ్రి మాటకు విలువ ఇచ్చిన కుమారునిగా, ప్రజలను తన బిడ్డలుగా పాలించిన రాజుగా, భార్య కోసం తపించిన భర్తగా, తనయుడిగా, సోదరునిగా, స్నేహితుడిగా… జీవితం మొత్తాన్ని ఆదర్శంగా గడిపాడు. దుష్టశిక్షణ కోసం శ్రీహరి మానవ రూపంలో అవతరించి ధర్మాన్ని స్థాపించాడు. ఇతిహాసాల ప్రకారం రాముని గుణాలు 16 ముఖ్యమైన ప్రత్యేకతలుగా చెప్పబడుతాయి.
జన్మతిథినే వివాహదినంగా
ఆగమ శాస్త్రాల ప్రకారం శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తరఫాల్గుణి నక్షత్రంలో వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ అవతార పురుషులు జన్మించిన నక్షత్రంలోనే కళ్యాణాన్ని జరిపించే సంప్రదాయం ప్రకారం, చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రానికే ‘శ్రీరామనవమి’గా జరుపుకుంటారు. ఈ రోజు రామనామాన్ని జపించడం వల్ల అంతరంగ పాపాలు కూడా నశిస్తాయని పండితులు చెబుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com