Bhadrachalam: రెండేళ్ల తర్వాత భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం.. అంచనాలకు మించిన భక్తుల హాజరు..

Bhadrachalam: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయుడి కల్యాణోత్సవం భద్రాచలంలో అత్యంత వేడుకగా జరిగింది. రెండు గంటల పాటు నిర్వహించిన రాములోరి కల్యాణ వేడుకతో భద్రాద్రి పులకించింది. రెండేళ్ల తర్వాత వేలాది భక్తుల నడుమ మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణ వేడుక అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ కమనీయ ఘట్టాన్ని వీక్షించి తరించారు భక్తులు. ఉదయం మూలమూర్తులకు ప్రధానాలయంలో వేదపండితులు ఏకాంతంగా తిరుకల్యాణం నిర్వహించారు.
అనంతరం సీతాసమేత కల్యాణ రాముడు మిథిలా మండపానికి చేరుకున్నారు. సీతారామచంద్రుల ఉత్సవమూర్తులను మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చి వేదికపై ఆసీనులను చేశారు. రాష్ట్రప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ రాములోరికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉదయం పదిన్నరకు శ్రీసీతారామచంద్రుడి కళ్యాణాన్ని వేదపండితులు ప్రారంభించారు.
భక్త రామదాసు చేయించిన నగలు అలంకరించిన సీతమ్మ, ముగ్ధమనోహరంగా శ్రీరాముడు పెళ్లిపీటలపై ఆసీనులను చేసి సంప్రదాయబద్దంగా పెళ్లి క్రతువు జరిపించారు. జీలకర్ర బెర్రం పెట్టించారు. పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుముహూర్తాన మాంగళ్యధారణ చేయించారు. వేదమంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా అర్చకులు స్వామివారి కల్యాణం జరిపించారు. సీతమ్మ తల్లి మెడలో రాములోరు తాళి కట్టే మధుర ఘట్టం కోసం రెండేళ్లుగా వేచిచూస్తున్న భక్తజనం కనులారా కల్యాణోత్సవాన్ని తిలకించారు.
ఈ కమనీయ ఘట్టాన్ని వీక్షించేందుకు రెండు కళ్లు కూడా సరిపోవన్నంతగా చూసి తరించింది భక్త కోటి. సీతారాముల కల్యాణోత్సవానికి మంత్రి సత్యవతి రాథోడ్, టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రికి తరలివచ్చారు. మిథిలా స్టేడియం భక్తులతో కిటకిటలాడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com