శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం

శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం

శివ అంటే మంగళం. శివ అంటే శుభం, శివ అంటే సర్వకార్యజయం, శివ అంటే సర్వపాపహరం. వేదాల్లో శివుని పేరుకి ఇన్ని అర్థాలున్నాయి. ఒక్కసారి శివనామస్మరణ చేస్తే చాలు.. పండితుడా, పామరుడా, చక్రవర్తా, కటిక పేదవాడా అని చూడడు. కోరిన కోరికలు తీరుస్తాడు ఆ భోళాశంకరుడు. శివస్య హృదయం విష్ణో.. విష్ణోశ్చ హృదయం శివః అంటారు. శివకేశవుల బేధం లేనిదే కార్తీకమాసం. హరికి హరుడికి సమారాధన జరిగే మాసం. అందుకే, ఈ మాసంలో చేసే ఏ దైవకార్యమైనా అంతులేని పుణ్యాన్నిస్తుంది. పైగా కార్తీక మాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాలు, దీపారాధనలకు చివరి అంకం శివపార్వతుల కల్యాణమే. ఈ భాగ్యాన్ని ప్రేక్షకులకు అందిస్తోంది టీవీ5.

సెన్సేషన్ కంటే మానవతా విలువలే ప్రామాణికంగా 14 సంవత్సరాలుగా వార్తస్రవంతిని అందిస్తోంది టీవీ5. హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీవీ5, హిందూధర్మం చానెల్స్ సంయుక్తంగా.. గత ఏడేళ్లుగా కార్తీకమాసంలో దీపోత్సవం, శివపార్వతుల కల్యాణాన్ని జరిపిస్తూ.. భక్తజనకోటి వీక్షించేలా ఏర్పాట్లు చేస్తోంది. 2013లో శివపార్వతుల కల్యాణంతో మొదలైన ఈ ప్రస్థానం.. ప్రతి ఏటా కొనసాగుతోంది. 2013, 2014లో హైదరాబాద్‌లో, 2015లో గుంటూరులో, 2016లో రాజమహేంద్రవరంలో, 2017లో వరంగల్‌లో, 2018లో కర్నూలులో, గతేడాది కర్నాటకలోని దావణగిరిలో మహోత్సవంగా జరిగింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా అనంత పుణ్యఫలం అందించే శివపార్వతుల కల్యాణాన్ని భక్తకోటి ముందు జరుపుతోంది టీవీ5. కరోనా కల్లోలం ఉన్నప్పటికీ.. ఆనవాయితీ తప్పకూడదనే ఉద్దేశంతో, అత్యంత సురక్షిత వాతావరణంలో మహోజ్వల ఘట్టాన్ని భక్తజనం ముందు సాక్షాత్కరింపజేస్తోంది.

ఈసారి శివపార్వతుల కల్యాణం జరిగే వేదిక నల్గొండ జిల్లా చింతపల్లిలోని శ్రీసాయినాథుని దివ్యధామం. తెలుగు రాష్ట్రాల్లో మరో షిరిడీ క్షేత్రంగా భాసిల్లుతున్న చింతపల్లి సాయినాథుని దివ్యధామంలో శివపార్వతుల కల్యాణం, దీపోత్సవం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భానోదయానే రుద్రయాగం కార్యక్రమం ఉంటుంది. వెయ్యి రుద్రాభిషేకాల ఫలాన్ని ఇచ్చేదే రుద్రయాగం. ఇందులో పాల్గొన్నా, చూసినా.. వారికి మృత్యుగండం, బాలారిష్టాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని వేదం చెబుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే శివపార్వతుల కల్యాణ ఘట్టం ముందుగా గణపతి ప్రార్థనతో మొదలవుతుంది. ఆ తరువాత అభిషేక ప్రియుడు అయిన రుద్రునికి రుద్రాభిషేకం జరుగుతుంది. అనంతరం.. పేరిణి శివతాండవ కార్యక్రమం ఉంటుంది. పరమశివుణ్ని తమ దేహంలోకి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందే నృత్యమే పేరిణి. దీనికి అనుబంధంగానే ఆనంద తాండవం జరుగుతుంది. సకల చరాచరకోటికి ఆనందానుభూతిని ప్రసాదించే నాట్యమే ఆనంద తాండవం.

ఇలా వరుస కార్యక్రమాలతో భక్తిరసంలో మునిగితేలుతుండగానే శివపార్వతులు కల్యాణ వేదిక మీదకు వేంచేస్తారు. అదే శోభాయాత్ర. దుర్లభమైన శోభాయాత్రను వీక్షించడం జన్మజన్మాల అదృష్టంగా భావిస్తారు భక్తులు. శోభాయాత్రానంతరం శివపార్వతుల కల్యాణం ఆరంభమవుతుంది. అర్ధనారీశ్వరతత్వంతో ఆదర్శ దాంపత్యాన్ని నిర్వచిస్తుంది శివపార్వతుల జంట. అందుకే వీరి కల్యాణం లోకానికి శుభకరం. సర్వమంగళ స్వరూపిణి అయిన పార్వతి జగజ్జననిగా.. సకల శుభంకరుడు అయిన శంకరుడు జగత్పితగా కల్యాణవేదికపై కొలువుదీరుతారు. కల్యాణం ముగిసిన వెంటనే కోటి దీపోత్సవం జరుగుతుంది. దీపం వెలింగించడం అంటేనే పరమ మంగళకరం. ఇలాంటి కార్యక్రమంతో ఈ ఏటి కార్తీకమాసానికి వీడ్కోలు పలకడం మరింత పుణ్యాన్ని అందిస్తుంది. అందుకే, శివపార్వతుల కల్యాణాన్ని చూసి తరించండి, పరవశించండి.

Tags

Read MoreRead Less
Next Story