Srivari Suprabhata Seva: తిరుమల శ్రీవారిని మేలుకొలిపే 'సుప్రభాత సేవ' విశిష్టత..

Srivari Suprabhata Seva:  తిరుమల శ్రీవారిని మేలుకొలిపే సుప్రభాత సేవ విశిష్టత..
Srivari Suprabhata Seva: శ్రీవారి సేవలలో అత్యంత ప్రముఖమైనది సుప్రభాత సేవ. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి మేలుకొలుపు సేవను ప్రత్యేక పద్ధతిలో నిర్వహిస్తారు.

Srivari Suprabhata Seva: కోరిన కోర్కెలు తీర్చే వేంకటేశ్వరుడు శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రుడు. ప్రతి హిందువు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా శ్రీవారి దర్శనం చేసుకోవాలని తాపత్రయపడుతుంటారు. స్వామి సేవలను వీక్షించాలని ఆరాటపడుతుంటారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఆచరించేందుకు తిరుమల దేవస్థానం సన్నద్ధమయ్యింది.

కోవిడ్ మహమ్మారి కారణంగా ఈసారి స్వామి వారికి ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే స్వామి వారికి సంబంధించిన మిగిలిన సేవలను, పూజా క్రతువులను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. శ్రీవారి సేవలలో అత్యంత ప్రముఖమైనది సుప్రభాత సేవ. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి మేలుకొలుపు సేవను ప్రత్యేక పద్ధతిలో నిర్వహిస్తారు. శ్రీవారి మేలుకొలుపు సేవనే సుప్రభాత సేవగా పిలుస్తారు.

సుప్రభాతం అంటే శుభోదయం అని అర్థం. స్వామివారు మేల్కొలుపుతో భక్త కోటికి శుభం కలుగుతుందని మరో అర్థం. 1979 మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు శ్రీవారికి వేకువజాము 3 గంటలకు సుప్రభాత సేవను నిర్వహిస్తున్నారు. 1979కి ముందు ఉదయం 4 గంటల తరువాతనే సుప్రభాత సేవ నిర్వహించేవారు.

శ్రీవారికి నిర్వహించే సుప్రభాత సేవలో మొత్తం నాలుగు ఘట్టాలు ఉంటాయి. అందులో మొదటిది సుప్రభాతం. కౌసల్యా, సుప్రజా రామ పూర్వా అంటూ ప్రారంభమయ్యే సుప్రభాతంలో మొత్తం 29 శ్లోకాలు ఉంటాయి. మొదటి శ్లోకంలో కౌసల్య పుత్రుడు రాముడికి, రెండవ శ్లోకంలో గోవిందుడికి, మూడో శ్లోకంలో అమ్మవారికి, మిగిలిన 24 శ్లోకాలను ఏడుకొండల వాడిని వేడుకుంటూ స్తుతిస్తారు. చివరి శ్లోకంలో భక్తులకు మోక్షం ప్రసాదించాలని కోరుతారు.

సుప్రభాత సేవలో రెండవ ఘట్టం స్తోత్రం.. ఇందులో మొత్తం 11 శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకాల్లో భక్తులు స్వామి వారి కటాక్షం పొందేందుకు శరణు కోరతారు. మూడవ ఘట్టం ప్రపత్తి. ఇందులో మొత్తం 16 చరణాలు ఉంటాయి. మొదటి చరణంలో అమ్మవారిని స్తుతిస్తూ ప్రార్ధన చేస్తారు. మిగిలిన చరణాల్లో శ్రీవారిని స్తుతిస్తూ వేడుకుంటారు. సుప్రభాత సేవలో చివరి ఘట్టం మంగళ శాసనం. ఇందులో 14 చరణాలు, 17 శ్లోకాలు ఉంటాయి.

స్వామివారికి వినిపించే సుప్రభాత శ్లోకాలను 15వ శతాబ్దంలో ప్రతివాతి భయంకర అణ్ణన్ రచించారు. సుప్రభాత సేవ తరువాత స్వామి వారికి నవనీత హారతి ఇచ్చి, వెన్న చక్కెరను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ హారతిని బాబా హథీరామ్ జీ సమర్పించడంతో అప్పటి నుంచి ఆచరణలో ఉంది.

ఏడాదిలో 11 మాసాలు ప్రతినిత్యం సుప్రభాత సేవతో స్వామి వారిని మేలుకొలిపితే ధనుర్మాసంలో మాత్రం తిరుప్పావైతో మేలుకొలుపు సేవను నిర్వహిస్తారు. గోదాదేవి రచించిన తిరుప్పావై 30 పాశురాలను రోజుకొకటి చొప్పున నెల రోజుల పాటు ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ మాసంలో శ్రీనివాసుడికి బదులుగా శ్రీ కృష్ణ స్వామి వారు శయనిస్తారు.

ధనుర్మాసంలో నిర్వహించే ఈ సేవలో జీయర్ స్వాములు, ఏకాంగులు, అర్చకులు పాల్గొంటారు. ఈ విధంగా ఏడాదిలో 11 మాసాలు సుప్రభాత సేవ, ఒక మాసం తిరుప్పావై సేవ చేసి శ్రీవారిని మేలుకొల్పుతారు అర్చక స్వాములు. తిరుమల శ్రీవారి భక్తులు స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొని తరిస్తారు.

Tags

Next Story