ఊర్మిళాదేవి 14 ఏళ్ల నిద్ర వెనుక ఉన్న రహస్యం ఇదే!

ఊర్మిళాదేవి 14 ఏళ్ల నిద్ర వెనుక ఉన్న రహస్యం ఇదే!
భర్త అభిమతాన్ని, అంతరంగాన్ని గుర్తించిన ఊర్మిళ అయోధ్యలోనే ఉండిపోతుంది. అయితే లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్లి వచ్చేంతవరకు ఆమె 14 ఏళ్ల పాటు నిద్రలోనే ఉండిపోతుంది.

రామాయణంలో స్త్రీ పాత్రలు అనేకం.. అందులో ఊర్మిళ పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.. ఊర్మిళ తండ్రి జనకమహారాజు .. సీతను రాముడికిచ్చి పెళ్లి చేసినప్పుడు .. సీత చెల్లెలైన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్ళి చేశారని వాల్మీకి రామాయణంలో ఉంది. ఇదిలావుండగా.. రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు.. నా రాముడు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానని సీత చెప్పడంతో సీతతో రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతాడు. అన్నావదినలకి రక్షణగా నేను కూడా వస్తానని లక్ష్మణుడు అంటాడు.

ముందుగా దీనికి అంగీకరించని రాముడు ఆ తర్వాత ఒప్పుకుంటాడు. అయితే అతనితోపాటు అతని భార్య ఊర్మిళ కూడా అడవికి వెళ్ళడానికి సిద్ధంకాగా, వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను చూసుకోవటానికి అయోధ్యలోనే ఉండమని లక్ష్మణుడు ఆమెను కోరుతాడు. భర్త అభిమతాన్ని, అంతరంగాన్ని గుర్తించిన ఊర్మిళ అయోధ్యలోనే ఉండిపోతుంది. అయితే లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్లి వచ్చేంతవరకు ఆమె 14 ఏళ్ల పాటు నిద్రలోనే ఉండిపోతుంది. ఆమె 14 ఏళ్ల నిద్ర వెనుక ఉన్న రహస్యం గురించి వాల్మీకి రామాయణంలో ఇలా చెప్పారు.

రాత్రివేళలో అరణ్యంలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్రవస్తుండడంతో తన కర్తవ్యానికి ఆటంకం కలిగించొద్దని, తనను ఈ పద్నాలుగేళ్లు విడిచిపెట్టమని నిద్రా దేవతని వేడుకుంటాడు. అయితే నిద్ర ప్రకృతి ధర్మమని, తన నిద్రను ఎవరికైనా పంచాలని కోరడంతో తన పద్నాలుగేళ్ళ నిద్రను తన భార్య ఊర్మిళకు ప్రసాదించమని కోరుతాడు. భర్త కోరిక ప్రకారం ఊర్మిళాదేవి సంతోషంగా ఆ నిద్రను పంచుకుంటుంది. అలా పద్నాలుగేళ్ళ పాటు ఊర్మిళ నిద్రపోతుంది. దీనినే ఊర్మిళాదేవినిద్ర అని అంటారు.

Tags

Read MoreRead Less
Next Story