TTD : శ్రీవారి దర్శనం వాయిదా వేసుకోండి: టీటీడీ చైర్మన్

TTD : భారీ వర్షాలు, వరదలతో చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి.. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు కొండ చెరియలు విరిగి పడుతున్నాయి. లింక్ రోడ్డు తర్వాత మూడు ప్రాంతాలలో ఘాట్ రోడ్డు కుంగిపోయింది. కొండపై నుంచి భారీ బండరాయి రోడ్డుపై పడింది. దీంతో మూడు చోట్ల రోడ్డు పాక్షికంగా ధ్వంసమైంది.
ఈ నేపథ్యంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. గత 20 ఏళ్లలో లేనివిధంగా భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయని ఆయన చెప్పారు. వాహనాల రాకపోకలు లేవడంతో భారీ ప్రమాదం తప్పిందన్నారు. నాలుగు ప్రాంతాల్లో రోడ్డు పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. రహదారుల మరమ్మత్తు కోసం ఢిల్లీ నుంచి ఐఐటీ నిపుణులు వస్తున్నారని తెలిపారు. మూడు రోజుల్లో రోడ్ల మరమ్మత్తులు పూర్తవుతాయని అన్నారు.
శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ ప్రయాణాన్ని మరో వారం రోజులు వాయిదా వేసుకుంటే మంచిదని సుబ్బారెడ్డి తెలిపారు. టిక్కెట్లు బుక్ చేసుకున్న ఆరు నెలల్లో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చని చెప్పారు. టికెట్లను రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తామని అన్నారు. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడ వీధులు, తిరుమల రహదారుల్లో వర్షపు నీరు భారీగా చేరడంతో ఆలయ సిబ్బంది వర్షం నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com