Home
 / 
భక్తి / Shiva Parvathula...

Shiva Parvathula Kalyanam 2021: టీవీ5, హిందూ ధర్మం ఛానళ్ల ఆధ్వర్యంలో.. కాశీ క్షేత్రంలో శివ పార్వతుల కళ్యాణం..

Shiva Parvathula Kalyanam 2021: కార్తీకమాసంలో శివపార్వతుల కల్యాణాన్ని వీక్షిస్తే, ఆ మహాదేవుని ఆశీస్సులతో.. ఇక పునర్జన్మ లేకుండా శాశ్వత శివసాన్నిధ్యం దొరికినట్టే.

Shiva Parvathula Kalyanam 2021: టీవీ5, హిందూ ధర్మం ఛానళ్ల ఆధ్వర్యంలో.. కాశీ క్షేత్రంలో శివ పార్వతుల కళ్యాణం..
X

Shiva Parvathula Kalyanam 2021: మాసానాం కార్తీకం పవిత్రం అంటారు. అంటే కార్తీక మాసంతో సమానమైన మాసం మరొకటి లేదని దీనర్థం. ఈ మాసంలో పరమ శివుడిని ఒక్క బిల్వ పత్రంతో పూజించినా, దోసెడు నీళ్లు పోసినా, ఒక్క దీపం వెలిగించినా చాలు. పరమపద సోపానాన్ని చేరుకుంటారని శాస్త్రోక్తి. అలాంటి కార్తీకమాసంలో శివపార్వతుల కల్యాణాన్ని వీక్షిస్తే, ఆ మహాదేవుని ఆశీస్సులతో.. ఇక పునర్జన్మ లేకుండా శాశ్వత శివసాన్నిధ్యం దొరికినట్టే. అంతటి మహిమాన్విత ఘట్టాన్ని మీ ముందు సాక్షాత్కరించబోతోంది టీవీ5. మహా ముక్తి క్షేత్రం.. పరమ పవిత్ర గంగా తీరాన.. పరమశివుని ఆవాసమైన వారణాశి క్షేత్రాన ఆదిదంపతుల కళ్యాణం జరగబోతోంది.

శివ అంటే మంగళం. శివ అంటే శుభం, శివ అంటే సర్వకార్య జయం, శివ అంటే సర్వపాపహరం. వేదాల్లో శివుని పేరుకి ఇన్ని అర్థాలున్నాయి. ఒక్కసారి శివనామస్మరణ చేస్తే చాలు.. పండితుడా, పామరుడా, చక్రవర్తా, కటిక పేదవాడా అని చూడడు. కోరిన కోరికలు తీరుస్తాడు ఆ భోళాశంకరుడు. శివస్య హృదయం విష్ణో.. విష్ణోశ్చ హృదయం శివః అంటారు. శివకేశవుల బేధం లేనిదే కార్తీకమాసం. హరికి హరుడికి సమారాధన జరిగే మాసం. అందుకే, ఈ మాసంలో చేసే ఏ దైవకార్యమైనా అంతులేని పుణ్యాన్నిస్తుంది. పైగా కార్తీక మాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాలు, దీపారాధనలకు చివరి అంకం శివపార్వతుల కల్యాణమే. ఈ భాగ్యాన్ని ప్రేక్షకులకు అందిస్తోంది టీవీ5.

హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీవీ5, హిందూధర్మం చానెల్స్ సంయుక్తంగా.. గత ఎనిమిదేళ్లుగా కార్తీకమాసంలో దీపోత్సవం, శివపార్వతుల కల్యాణాన్ని జరిపిస్తూ.. భక్తజనకోటి వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి.. 2013లో శివపార్వతుల కల్యాణంతో మొదలైన ఈ ప్రస్థానం.. ప్రతి ఏటా కొనసాగుతోంది. 2013,2014లో హైదరాబాద్‌లో, 2015లో గుంటూరులో, 2016లో రాజమహేంద్రవరంలో, 2017లో వరంగల్‌లో, 2018లో కర్నూలులో, 2019లో కర్నాటకలోని దావణగిరిలో మహోత్సవంగా జరిగింది. గత ఏడాది నల్గొండ జిల్లా చింతపల్లిలోని శ్రీసాయినాథుని దివ్యధామంలో కల్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించింది టీవీ5.. ఈ ఏడాది కూడా అనంత పుణ్యఫలం అందించే శివపార్వతుల కల్యాణాన్ని పవిత్ర కాశీ క్షేత్రంలో గంగా తీరంలోని అస్సీఘాట్‌లో నిర్వహిస్తోంది..

టీవీ5, హిందూ ధర్మం ఛానళ్ల ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ శరణ్‌ శర్మ గురూజీ బ్రహ్మత్వంలో కళ్యాణ ఘట్టం ఆధ్యంతం కమనీయంగా, కడు రమణీయంగా సాగనుంది.. కళ్యాణానికి ముందు అస్సీ ఘాట్‌ నుంచి సాయంత్రం ఐదు గంటలకు శోభాయాత్ర మొదలవుతుంది.. శోభాయాత్రను వీక్షించడం జన్మజన్మాల అదృష్టంగా భావిస్తారు భక్తులు. శోభాయాత్రానంతరం శివపార్వతుల కల్యాణం ఆరంభమవుతుంది. శివపార్వతుల కల్యాణ ఘట్టం ముందుగా గణపతి ప్రార్థనతో మొదలవుతుంది. ఆ తరువాత అభిషేక ప్రియుడు అయిన రుద్రునికి రుద్రాభిషేకం జరుగుతుంది.

అర్ధనారీశ్వరతత్వంతో ఆదర్శ దాంపత్యాన్ని నిర్వచిస్తుంది శివపార్వతుల జంట. అందుకే వీరి కల్యాణం లోకానికి శుభకరం. సర్వమంగళ స్వరూపిణి అయిన పార్వతి జగజ్జననిగా.. సకల శుభంకరుడు అయిన శంకరుడు జగత్పతిగా కల్యాణవేదికపై కొలువుదీరుతారు. కల్యాణం ముగిసిన తర్వాత కోటి దీపోత్సవం జరుగుతుంది. దీపం వెలింగించడం అంటేనే పరమ మంగళకరం. ఇలాంటి కార్యక్రమంతో ఈ ఏటి కార్తీకమాసానికి వీడ్కోలు పలకడం మరింత పుణ్యాన్ని అందిస్తుంది. అందుకే, శివపార్వతుల కల్యాణాన్ని చూసి తరించండి.. పరవశించండి.

Next Story