New Year: ఏడాదిలో ఆలయ సందర్శన.. ఆ రోజు స్వామిని దర్శించుకుంటే..

New Year: ముందు రోజు రాత్రి సందడి చేసినా జనవరి ఫస్ట్ అనగానే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు క్యూ కట్టేస్తారు. గత ఏడాది తలపెట్టిన పనులు వాయిదా పడ్డాయి.. ఈ ఏడాది అయినా ఏడుకొండల వాడి అనుగ్రహం తమపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.
స్వామిని కరుణించమని మనసారా వేడుకుంటారు. తిరుమల శ్రీవారిని కొత్త ఏడాదిలో దర్శించుకోవాలని శ్రీవారి భక్తులు విశ్వసిస్తారు. కానీ టికెట్లు దొరకక నిరాశ చెందేవారు కొందరైతే.. సమీప దేవాలయానికి వెళ్లి సంతృప్తి చెందేవారు మరికొందరు.
రోజు మాదిరిగానే ఆరోజు కూడా గడిచిపోతే అందులో తేడా ఏం ఉంటుంది.. అందుకే డిసెంబర్ 31 రాత్రి ఎంత లేటుగా పడుకున్నా జనవరి 1వ తేదీని ఉదయాన్నే లేచి తల స్నానం చేసి దేవాలయాలు సందర్శిస్తారు..
కొత్త ఏడాది మనకు ఉగాదితోనే ప్రారంభమైనా ఇంగ్లీషు ఏడాదిని ఏమాత్రం చిన్న చూపు చూడరు మన భారతీయులు.. సంబరాలు అంబరాన్ని అంటుతాయి.. ఇక కొన్ని మాల్స్‌లో అయితే కొత్త ఏడాది మొదలయ్యే జనవరి నెలలో వాళ్ల సేల్స్‌ని పెంచుకునేందుకు భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు.
ఎన్నో ప్రణాళికలు.. మరెన్నో వాగ్ధానాలు..
రేపట్నించి స్ట్రిక్ట్‌గా పాటిస్తానని మద్యం బాటిల్ మీద ఒట్టు పెట్టే మందు బాబులు కొందరైతే.. పెరిగిన పొట్టను ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో కరిగించేయాలని భుక్తాయాసంతో బాధపడుతూ పొట్టను తడుముకునే వారు మరికొందరు. ఎన్నో నేర్చుకోవాలి.. మరెన్నో చేయాలి..
అన్నింటికీ కొత్త ఏడాది వేదిక కావాలి.. కానీ అలా అనుకునే లోపే రోజులు గడిచిపోతుంటాయి.. మంచి పని తలపెట్టేందుకు రోజుతో పని లేదు.. రేపు కాదు ఈ రోజే ఈ క్షణమే చేసేయండి తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది అని అనుభవజ్ఞులు చెబుతుంటారు. ఆచరిస్తే మంచిదే కదా. మీరు మరొకరికి చెప్పొచ్చు. మీరే వారికి రోల్ మోడల్ కావచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com