ఆంజనేయుడు లేని రామాలయం.. ముస్లింలు కూడా దర్శించుకుకుంటారు..ఏక్కడంటే..!

ఆంజనేయుడు లేని రామాలయం.. ముస్లింలు కూడా దర్శించుకుకుంటారు..ఏక్కడంటే..!
రామా.. అని పిలిస్తే పలికే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు ఒంటిమిట్ట రామచంద్రుడు. దక్షిణ భారతదేశంలో ప్రాచీన శిల్పకళా సంపదను ఎలుగెత్తి చెప్పే ప్రసిద్ధ

రామా.. అని పిలిస్తే పలికే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు ఒంటిమిట్ట రామచంద్రుడు. దక్షిణ భారతదేశంలో ప్రాచీన శిల్పకళా సంపదను ఎలుగెత్తి చెప్పే ప్రసిద్ధ దేవాలయాల్లో ఒంటిమిట్ట కోదండరామాలయం ఒకటి. ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా పిలిస్తారు. మత సామరస్యానికి ప్రతీక ఇక్కడి కోదండరాముడిని.. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరు దర్శించుకుంటారు. ఒంటిమిట్ట రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడని ప్రతీతి. పురాణాల ప్రకారం రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణ కోసం తీసుకెళ్లాడని మనకి తెలుసు.

కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే మరోసారి ఏర్పడింది. మృకండు మహర్షి, శృంగి మహర్షి నిర్వహిచిన యాగాలకి రాక్షసుల వల్ల ఆటంకం వాటిళ్లింది అప్పుడు.. ఆ మహర్షులు రామున్ని ప్రార్థించగా.. దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ప్రతీకగానే ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించగా.. జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.

అలాగే ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణులను ఇక్కడ మనం చూడవచ్చు. అందుకే దీనికి ఏకశిలా నగరం అన్ని పేరొచ్చింది. అయితే.. రామాలయం ఉందంటే సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామి కూడా తప్పకుండా ఉంటాడు. కానీ ఒంటిమిట్ట ఆలయంలో మాత్రం హనుమంతుడి విగ్రహం ఉండదు. దేశంలో ఆంజనేయస్వామి లేకుండా రాములవారు ఉన్న ఆలయం ఇదొక్కటే. ఈ దేవాలయంలో శ్రీరామతీర్థం కూడా ఉంది. అరణ్యవాసం చేసేటప్పుడు రామచంద్రుడు. ఈ ప్రదేశాన్ని సందర్శించాడని రామాయణంలో పేర్కొనబడింది. ఒక రోజు సీతాదేవికి దాహం వేయగా.. రాముడు సీతాదేవి దాహాన్ని తీర్చడానికి తన బాణాన్ని సందించి పాతాళ గంగను పైకి తెప్పించాడట. ఆ నీటిని తాగి సీతాదేవి తృప్తి చెందినదిగా ఇతిహాసాల్లో చెప్పబడింది. ఆ పాతాళగంగే నేటి రామతీర్థంగా పిలువబడుతుంది.

ఒంటిమిట్ట రామాలయంలో మరో ముఖ్యమైన ఆకర్షణ "ఇమాంబేగ్ బావి". 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ కి ప్రతినిథిగా పనిచేసేవారు ఇమాంబేగ్ అనే వ్యక్తి. ఆయన ఒకసారి.. ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడట. దానికి భక్తులు.. భక్తి భావంతో, చిత్తశుద్ధితో పిలిస్తే ఆ రాముడు కచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా.. ఇమాంబేగ్ మూడు సార్లు రాముని పిలిచాడట. ఆయన పిలుపుకి ప్రతిగా.. మూడు సార్లు 'ఓ' అని సమాధానం వచ్చిందట. దానికి ఆయన చాలా ఆశ్చర్యచకితుడై.. ఆరోజు నుండి రామభక్తుడిగా మారిపోయాడట. ఆ తరువాత స్వామివారి కైంకర్యాలు కోసం అక్కడ ఒక బావిని కూడా తవ్వించాడట. ఆయనపేరు మీదుగానే ఈ బావిని "ఇమాంబేగ్ బావిగా" వ్యవహరించడం జరుగుతుంది.

ఈ కారణంగానే, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడి విశేషం. పుట్టపర్తికి వచ్చే ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి వస్తుంటారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా, వైభవోపేతంగా నిర్వహిస్తారు అర్చక స్వాములు. రాష్ట్రా ప్రభుత్వం పట్టు వస్త్రాలను, తలంబ్రాలను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story