Amarnath Yatra: అమర్‌నాథ్ గుహలో మంచు శివలింగం.. ఏంటి ప్రత్యేకత.. యాత్ర ఎప్పుడు ప్రారంభమైంది..

Amarnath Yatra: అమర్‌నాథ్ గుహలో మంచు శివలింగం.. ఏంటి ప్రత్యేకత.. యాత్ర ఎప్పుడు ప్రారంభమైంది..
Amarnath Yatra: వేసవిలో కొన్ని రోజులు మినహా సంవత్సరంలో చాలా వరకు ఈ గుహ మంచుతో కప్పబడి ఉంటుంది.

Amarnath Yatra: అమర్‌నాథ్ ధామ్ జమ్మూ, కాశ్మీర్‌లోని హిమాలయ పర్వతాలలో ఉన్న ఒక పవిత్ర గుహ. ఇది హిందువులు పవిత్రంగా భావించే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.

అమర్‌నాథ్‌లోని పవిత్ర గుహలో శివుడు మంచు లింగం రూపంలో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు. మంచు నుండి శివలింగం ఏర్పడినందున దీనిని 'బాబా బర్ఫానీ' అని కూడా పిలుస్తారు.

పవిత్ర గుహ చుట్టూ హిమనీనదాలు, మంచు పర్వతాలు ఉన్నాయి. వేసవిలో కొన్ని రోజులు మినహా సంవత్సరంలో చాలా వరకు ఈ గుహ మంచుతో కప్పబడి ఉంటుంది. కొన్ని రోజులు యాత్రికుల సందర్శనార్థం ఈ గుహ తెరిచి ఉంటుంది.


విశేషమేమిటంటే ఈ గుహలో ప్రతి సంవత్సరం మంచు శివలింగం సహజంగా ఏర్పడుతుంది. గుహ పైకప్పు పగుళ్ల నుంచి కారుతున్న నీటి బిందువుల వల్ల మంచు శివలింగం ఏర్పడుతుంది. విపరీతమైన చలి కారణంగా నీరు ఘనీభవించిన మంచు శివలింగం ఆకారాన్ని సంతరించుకుంటుంది.

చంద్రుని కాంతిని బట్టి పెరుగుతూ, తగ్గుతూ ఉండే ప్రపంచంలోని ఏకైక శివలింగం ఇదే. ఈ శివలింగం శ్రావణ శుక్ల పక్ష పౌర్ణమి నాడు పూర్తవుతుంది. ఆ తర్వాత వచ్చే అమావాస్య నాటికి పరిమాణం క్రమంగా తగ్గుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది.


ఈ మంచు శివలింగాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమర్‌నాథ్ పవిత్ర గుహను సందర్శిస్తారు. మంచు శివలింగానికి ఎడమ వైపున రెండు చిన్న మంచు శివలింగాలు ఏర్పడ్డాయి,.అవి తల్లి పార్వతి, గణేశుని చిహ్నాలుగా భక్తులు కొలుస్తారు.

అమర్‌నాథ్ పవిత్ర గుహ ఎక్కడ ఉంది?

అమర్‌నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో అమర్‌నాథ్ పర్వతంపై 17 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది.

దక్షిణ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలో అమర్‌నాథ్ గుహ ఉంది. ఈ గుహ లిడ్డర్ వ్యాలీకి చివరిలో ఇరుకైన లోయలో ఉంది. ఇది పహల్గామ్ నుండి 46-48 కి.మీ ఉంటే బల్తాల్ నుండి 14-16 కి.మీ. ఉంటుంది.


ఈ గుహ సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉంది. కాలినడకన లేదా పోనీ ద్వారా మాత్రమే చేరుకోగలుగుతారు.

యాత్రికులు పహల్గాం నుండి 46-48 కి.మీ లేదా బాల్తాల్ నుండి 14-16 కి.మీల దూరంలో ఉన్న ఏటవాలు, వంకర పర్వత మార్గం గుండా ట్రెక్కింగ్ ద్వారా ఇక్కడికి చేరుకుంటారు.

అమర్‌నాథ్ గుహకు సంబంధించిన పురాణం ఏమిటి?

అమర్‌నాథ్ గుహకు సంబంధించిన పురాణం ప్రకారం, ఒకసారి మాత పార్వతీ దేవి తన అమరత్వానికి గల కారణం గురించి శివుడిని అడుగుతుంది. దానికి శివుడు ముందు అమర కథను వినమని పార్వతిని కోరుతాడు.

పార్వతీ మాత అమర కథ వినడానికి ఒప్పుకుంటుంది. దీని కోసం ఎవరూ వినలేని రహస్య ప్రదేశం కోసం అన్వేషిస్తాడు. చివరికి అతడు అమర్‌నాథ్ గుహకు చేరుకుంటాడు.


అమర్‌నాథ్ గుహకు చేరుకోవడానికి ముందు, శివుడు పహల్గామ్‌లోని నందిని, చందన్‌వాడి వద్ద చంద్రుడిని, శేషనాగ్ సరస్సు ఒడ్డున ఉన్న సర్పాన్ని, మహాగుణ పర్వతంపై ఉన్న గణేష్‌ని, పంచతర్ణిలో ఉన్న ఐదు అంశాలను (భూమి, నీరు, గాలి, అగ్ని, వాయువు) విడిచిపెట్టాడు.

పార్వతి సమేతంగా అమర్‌నాథ్ గుహకు చేరుకున్న తర్వాత శివుడు సమాధి అయ్యాడు. ఆ అమర కథను మరెవరూ వినకుండా, గుహ చుట్టూ ఉన్న ప్రతి జీవిని నాశనం చేయమని కాలాగ్నిని ఆదేశించాడు.

దీని తరువాత శివుడు పార్వతికి అమరత్వం యొక్క కథను వివరించాడు, అయితే ఒక జంట పావురాలు కూడా ఈ కథను విని అమరత్వం పొందాయి. నేటికీ, చాలా మంది భక్తులు అమర్‌నాథ్ గుహలో ఆ జంట పావురాలు ఉన్నాయని చెబుతారు. ఇంత ఎత్తైన, చలి ప్రాంతంలో ఈ పావురాలు మనుగడ సాగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

భక్తుల సందర్శనార్థం అమర్ నాథ్ గుహలో మంచుతో చేసిన లింగం రూపంలో సహజసిద్ధంగా ఏర్పడిన శివపార్వతులు నేటికీ దర్శనమిస్తున్నారు.

అమర్‌నాథ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమైంది?


అమర్‌నాథ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమైందనే దానిపై అధికారికంగా ఎలాంటి రికార్డు లేదు. 12వ శతాబ్దంలో కల్హణ గ్రంథం రాజతరంగిణిలో అమర్‌నాథ్ ప్రస్తావన ఉంది.

11వ శతాబ్దంలో రాణి సూర్యమతి అమర్‌నాథ్ ఆలయానికి త్రిశూల్, బనలింగ్ వంటి అనేక పవిత్ర వస్తువులను దానం చేసిందని పురాణ గ్రంధాల్లో ఉంది.

అమర్‌నాథ్ గుహను మొదట భృగు మహర్షి కనుగొన్నాడని మరో కథ ప్రచారంలో ఉంది. వాస్తవానికి, కాశ్మీర్ లోయ నీటిలో మునిగిపోయిన తర్వాత, కశ్యప మహర్షి నీటిని బయటకు తీశారు. నీరు బయటకు వచ్చిన తర్వాత భృగు మహర్షి అమర్‌నాథ్‌లో శివుడిని మొదటిసారి చూశాడు.

ఆధునిక పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, అమర్‌నాథ్ గుహను 1850లో బూటా మాలిక్ అనే ముస్లిం గొర్రెల కాపరి కనుగొన్నాడు. 1898లో స్వామి వివేకానంద అమర్‌నాథ్ గుహను సందర్శించినట్లు 'నోట్స్ ఆఫ్ సమ్ వండరింగ్ విత్ స్వామి వివేకానంద'లో సోదరి నివేదిత పేర్కొంది.

అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?


చాలా కాలంగా బూటా మాలిక్ బంధువులు, దశనమి అఖారా పండితులు, పూజారి సభ మట్టన్ ఈ మందిరానికి సాంప్రదాయ పోషకులుగా వ్యవహరించేవారు.

2000లో, జమ్మూ కాశ్మీర్‌లోని ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం యాత్ర సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి గవర్నర్ నేతృత్వంలో శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డును ఏర్పాటు చేసింది. మాలిక్ కుటుంబంతో పాటు హిందూ సంస్థలను కూడా పుణ్యక్షేత్రం బోర్డు నుండి తొలగించారు.

అమర్‌నాథ్ యాత్ర ఎప్పుడు నిర్వహిస్తారు?

హిందువుల పవిత్ర మాసం జూలై-ఆగస్టులో సాధారణంగా అమర్‌నాథ్ యాత్ర జరుగుతుంది. మొదట్లో 15 రోజులు లేదా నెల రోజుల పాటు పాదయాత్ర జరిగేది. 2004లో బోర్డు దాదాపు 2 నెలల పాటు యాత్రను నిర్వహించాలని నిర్ణయించింది.

1995లో అమర్‌నాథ్ యాత్ర 20 రోజుల పాటు కొనసాగింది. 2004 నుండి 2009 వరకు 60 రోజుల పాటు కొనసాగింది. ఆ తర్వాత సంవత్సరాల్లో యాత్ర 40 నుంచి 60 రోజుల పాటు కొనసాగింది.

2019లో, ఈ యాత్ర జూలై 1 నుండి ఆగస్టు 15 వరకు ప్రారంభం కావాల్సి ఉంది, అయితే ఆర్టికల్ 370 రద్దుకు కొన్ని రోజుల ముందు భద్రతా కారణాల వల్ల రద్దు చేయబడింది.

కొన్నేళ్లుగా అమర్‌నాథ్ యాత్రికుల సంఖ్య పెరిగింది. 1990వ దశకంలో వేలాది మంది నుండి ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు లక్షలాది మంది యాత్రికులు అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. 2011లో రికార్డు స్థాయిలో 6.34 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్‌ను సందర్శించారు.

అమర్‌నాథ్ యాత్ర యొక్క పాత మరియు కొత్త మార్గం ఏమిటి?


కాలంతో పాటు అమర్‌నాథ్ యాత్ర రూట్ మారుతూ వస్తోంది. ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణంతో పాటు ప్రయాణ మార్గం కూడా మారింది. ఇప్పుడు అమర్‌నాథ్‌ను సందర్శించేందుకు రెండు మార్గాలు ఉన్నాయి.

ఒక మార్గం పహల్గామ్ నుండి ప్రారంభమవుతుంది, ఇది దాదాపు 46-48 కి.మీ. ఈ మార్గంలో ప్రయాణించడానికి 5 రోజులు పడుతుంది.

రెండవ మార్గం బాల్టాల్ నుండి మొదలవుతుంది, ఇక్కడ నుండి గుహ దూరం 14-16 కిమీ ఉంటుంది, కానీ నిటారుగా ఉన్నందున అందరికీ అక్కడికి చేరుకోవడం సాధ్యం కాదు. అయితే ఈ మార్గం గుండా ప్రయాణం 1-2 రోజులు మాత్రమే పడుతుంది.

అమర్‌నాథ్ యాత్రపై 36సార్లు ఉగ్రదాడులు జరిగాయి


1993లో పాకిస్థాన్‌కు చెందిన హర్కత్-ఉల్-అన్సార్ అనే ఉగ్రవాద సంస్థ అమర్‌నాథ్ యాత్రికులపై తొలిసారిగా బెదిరింపులకు పాల్పడింది.

2000లో అమర్‌నాథ్ యాత్రపై తొలి ఉగ్రదాడి జరిగింది. ఇందులో 32 మంది మరణించగా, వీరిలో 21 మంది యాత్రికులు ఉన్నారు.

2001లో యాత్రికుల శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన గ్రెనేడ్ దాడిలో 13 మంది చనిపోయారు.

2002లో రెండు ఉగ్రదాడుల్లో 11 మంది యాత్రికులు చనిపోయారు.

2017లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 8 మంది యాత్రికులు చనిపోయారు.

1990 నుంచి 2017 వరకు 27 ఏళ్లలో అమర్‌నాథ్ యాత్రపై 36 ఉగ్రదాడులు జరిగాయని, అందులో 53 మంది యాత్రికులు మరణించారని, 167 మంది గాయపడ్డారని 2017లో ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది.

అయినా అమర్‌నాథ్ యాత్ర అంటే భక్తులు అత్యంత ఉత్సాహం చూపుతారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలు యాత్రను రద్దు చేసింది బోర్డు.. మళ్లీ ఇప్పుడు జూన్ నెలలో యాత్ర మొదలవుతుందని తెలియడంతో భక్తులు అప్పుడే ప్రయాణానికి ఏర్పాట్లు మొదలు పెట్టేస్తున్నారు. పరమశివుని భక్తులు మంచురూపంలో ఉన్న ఆ శివలింగాన్ని కనులారా వీక్షించాలని తపన పడుతుంటారు.. ఎన్ని ప్రయాసలకు ఓర్చి అయినా అమర్‌నాథ్ యాత్రకు సిద్ధమవుతుంటారు.

Tags

Next Story