Bhadradri Divya Kshetram youTube: : భద్రాద్రి రామయ్యకు యూట్యూబ్ ఛానల్

భద్రాచలం రామాలయం తరఫున భద్రాద్రి దివ్యక్షేత్రం’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించారు. మన భద్రాద్రి రామయ్య పేరిట కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేశామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు ఆలయంలో రోజువారీ క్రతువుల గురించి తెలిపేలా ఈ యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పోస్ట్ చేయనున్నట్లు తెలిపారు. ట్రయల్ రన్ గా ఒక వీడియోను కూడా అప్ లోడ్ చేశారు. ఆ వీడియోలో తెలుగు రాష్ట్రాల్లో రాములవారికి ఉన్న భూముల వివరాలు, బంగారం, వెండి ఆభరణాల వివరాలను పేర్కొన్నారు. 1300 ఎకరాల భూమి, 68 కిలోల బంగారం, 980 కిలోల వెండి ఉన్నాయని 20 నిమిషాల నిడివితో తయారు చేసిన వీడియోను.. త్వరలోనే అప్ లోడ్ చేయనున్నారు. అలాగే ఉత్సవాలకు సంబంధించిన వీడియోలను కూడా ఈ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తామని రమాదేవి వివరించారు. వీటితో పాటు ఆలయంలో నిర్వహించిన పలు ఉత్సవాల వీడియోలను సైతం ఇందులో పొందుపర్చనున్నారు. త్వరలోనే ఈ ఛానెల్ లైవ్‌లోకి రానుంది. టీటీడీకి కూడా తిరుమల శ్రీవారి పేరుతో టీవీ ఛానెల్, యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తోంది. ఇప్పుడు భద్రచలం ఆలయం కూడా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభిస్తోంది.
తిరుమల తరహాలో..
గతేడాదే భద్రచలం ఆలయంలో తిరుమల తరహాలోనే ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో నిత్య కళ్యాణం, అభిషేకం, అర్చన, దర్శనం, సుప్రభాతం, పవళింపు, తులాభారం, వేదాశీర్వచనం, పట్టాభిషేకం, రథసేవలు వంటి టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కలిగింది. నిత్యం వీఐపి, వీవీఐపిల రాకతో కలకలాడే భద్రగిరి అభివృద్ధిని ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు. గోదావరి తీరంలోని ఈ పుణ్యక్షేత్రాన్ని టూరిజం హబ్‌గా కూడా అభివృద్ధి చేయాలని, ప్రత్యేక దృష్టి సారించాలని భద్రాచలం వాసులు, భక్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఆలయ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. భద్రాచలం కేంద్రంగా టూరిజం అభివృద్ధికి అవకాశం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు ప్రయత్నించడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com