నెల్లూరు ముసలంతో వైసీపీకి ముప్పు తప్పదా..?

నెల్లూరు ముసలంతో వైసీపీకి ముప్పు తప్పదా..?
నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించనుందా ? సింహపూరిలో ముసలం పుడితే రాష్ట్ర రాజకీయాలకు చెమటలు పట్టాల్సిందేనా?

నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించనుందా ? సింహపూరిలో ముసలం పుడితే రాష్ట్ర రాజకీయాలకు చెమటలు పట్టాల్సిందేనా? సింహపూరి ముసలంతో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవా? విశ్లేషకుల అంచనాలు నిజమవుతాయా? నెల్లూరులో ప్రభావితం చూపలేని పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అటకెక్కాల్సిందేనా? మరి నెల్లూరు పెద్దారెడ్లు ఏం చేయబోతున్నారు? నెల్లూరు రాష్ట్ర రాజకీయాలను శాసించనుందా?

ఏపీలో రాజకీయంగానే కాకుండా భౌగోళిక, ఆర్థికంగా నెల్లూరు జిల్లా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. భౌగోళికంగా తమిళనాడుకు దగ్గరగా ఉండే నెల్లూరు జిల్లా అన్నిట్లోనూ కాస్త భిన్నం. భాష, యాస, కట్టు, బొట్టుతో పాటు వ్యవసాయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇక రాజకీయాల్లో చెప్పాల్సిన పనేలేదు. సింహపురిగా పేరుగాంచిన నెల్లూరు జిల్లా రాజకీయంగానూ చైతన్యం ఎక్కువ. నెల్లూరు జిల్లా నుండి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అత్యున్నత పదవులు అధిరోహించారు. ఇక నెల్లూరు జిల్లాలో ఆనం, నల్లపురెడ్డి, సోమిరెడ్డి, మేకపాటి కుటుంబాలకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ముఖ్యంగా ఆనం రామనారాయణ రెడ్డి తండ్రి వెంకటరెడ్డి కొన్ని దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాలను శాసించారు. వీరి కుమారుల్లో ఆన వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. మరో కుమారుడు రామనారాయణ రెడ్డి ఉమ్మడి ఏపీలో మంత్రిగా వ్యవహరించారు. సోమిరెడ్డి కుటుంబంలో చంద్రమోహన్ రెడ్డి టీడీపీలో బలమైన నాయకుడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ మంత్రిగా పనిచేశారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల నుంచే మాత్రమే ముఖ్యముంత్రులు అయ్యారు. అత్యంత చైతన్యవంతమైన జిల్లాలుగా చెప్పుకొనే గోదావరి జిల్లాల నుంచి కూడా ఎవరూ సీఎంలు కాలేకపోయారు. కానీ నెల్లూరు జిల్లాకు చెందిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోటీని తట్టుకుని ముఖ్యమంత్రి అయి ప్రత్యేకత చాటారు. ఇక బీజేపీలో సాధారణ కార్యకర్తగా మొదలుపెట్టి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, ఉప రాష్ట్రపతిగా ఎదిగిన ముప్పవరకు వెంకయ్యనాయుడి ప్రస్థానం రాజకీయంగా ఎందరికో స్ఫూర్తిదాయకం. అధికారంలో ఉన్న పార్టీలో ఆ జిల్లాలో గనుక ధిక్కార స్వరాలు, అసమ్మతి గళం మొదలైతే.. ఆ వెంటనే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షంలోకి పడిపోతుందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు.. 1999 ఎన్నికల తర్వాత ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు తిరుగులేని పరిస్థితి. అలాంటి సమయంలో.. అటుఇటుగా 2003 సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి అసమ్మతి గళం వినిపించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో కాంగ్రెస్‌లో చేరారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక 2009 ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్ హవా సాగింది. అప్పటికే రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన సోదరుడు వివేకానందరెడ్డి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. దీంతో 2009లో కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకుంది. అయితే, వైఎస్ మరణం తర్వాత ఉమ్మడి ఏపీ రాజకీయాలు మారిపోయాయి. ఆనం కుటుంబం కాంగ్రెస్‌లో ఇమడలేక 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరింది. దీంతోపాటే ఆ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా విజయం సాధించింది. కాగా, 2018 వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ మీద విరుచుకుపడే ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. ఆయన తమ్ముడు రామనారాయణరెడ్డి వైసీపీలోకి వచ్చారు. తర్వాతి ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది.

అయితే చరిత్రను విశ్లేషిస్తే నెల్లూరు రాజకీయాల్లో ముసలం పుట్టిన ప్రతిసారీ అధికార పార్టీ ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో అధికారం కోల్పోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. నెల్లురూ జిల్లా అధికార వైసీపీ లో అసంతృప్త నేతలు బయటకొచ్చాక పలు జిల్లాల్లో అసమ్మతి నేతలు బయటకొస్తున్న ఘటనలు కోకొల్లలు. ఈ జిల్లాలో ఏకంగా అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బహిష్కరణ వేటుకు గురయ్యారు. వీరిలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉండడం విశేషం. ఇక మేకపాటి కుటుంబం తొలి నుంచి వైఎస్ జగన్ వెంట నడిచింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకప్పుడు జగన్‌కు ఎంతటి బలమైన అనుచరుడు. ఇలాంటి వారిపై వేటు అంటే రాజకీయంగా పెను సంచలనమే. చరిత్రను బట్టి చూస్తే నెల్లూరు అధికార పార్టీలో చెలరేగిన అలజడి అధికార పీఠాన్ని కదిలిస్తుందా లేదా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story