నారాయణ్‌ఖేడ్ బీఆర్ఎస్‌లో టికెట్ రేస్‌..?

నారాయణ్‌ఖేడ్ బీఆర్ఎస్‌లో టికెట్ రేస్‌..?
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్‌లో అసమ్మతి బయటపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది

ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తనకు ఎదురే లేదరనుకున్నారా అంతలోనే నేనున్నానంటూ మరో నాయకుడు రెడీ అయ్యాడా? హ్యాట్రిక్‌పై గంపెడాశలు పెట్టుకున్న ఆ ఎమ్మెల్యేకు పొగ బెడుతున్నదెవరు? సేవా కార్యక్రమాల పేరుతో ప్రజలతో మమేకమవుతున్నారా? నియోజకవర్గంలో పరిణామాలతో ఆ ఎమ్మెల్యే ఉక్కపోతకు గురవుతున్నారా?

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్‌లో అసమ్మతి బయటపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పలు నియోజకవర్గాలలో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉక్కపోతకు గురవుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఆత్మీయ సమ్మేళనాలు, సేవా కార్యక్రమాల నిర్వహిస్తూ ఆశావహులు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సవాళ్లు విసురుతున్నారు. నారాయణ్ ఖేడ్ జిల్లాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి పోటీగా శ్రీనివాస్ గౌడ్ తెరపైకి రావడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారినట్లు చర్చ నడుస్తోంది.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. 2016లో జరిగిన ఉప ఎన్నికలతో కాంగ్రెస్‌ కోటను బద్దలు కొట్టి బీఆర్ఎస్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లోనూ ఆయనే గెలిచారు. ఇక రాబోయే ఎన్నికల్లోనూ టికెట్ తనకే లభిస్తుందని ధీమాతో ఉన్న భూపాల్ రెడ్డికి మరో నేత ఎసరు పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పెద్దశంకరంపేటకు చెందిన కేంద్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ విగ్రం శ్రీనివాస్‌గౌడ్‌ సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గం మొత్తం కలియతిరుగుతున్నారు. శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి రామాగౌడ్‌కు నియోజకవర్గంలో గట్టి పట్టే ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో గీత పారిశ్రామిక సహకార సంఘం ఛైర్మన్‌గా రామాగౌడ్ పని చేశారు. తండ్రి మృతితో విగ్రం రామాగౌడ్‌ పీపుల్స్‌ వెల్ఫేర్‌ ట్రస్టు ఏర్పాటు చేసిన శ్రీనివాస్‌గౌడ్‌ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో పెద్దశంకరంపేటకే పరిమితమైన ఈ కార్యక్రమాలు ఇప్పుడు నియోజకవర్గం మొత్తం విస్తరించారు. దీంతో నియోజకవర్గంలో బిఆర్ఎస్‌ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు పబ్లిక్‌లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తీరుతో అసంతృప్తిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు శ్రీనివాస్‌గౌడ్‌ చుట్టూ చేరుతుండటంతో ఎమ్మెల్యేకు కంటిమీద కునుకు లేకుండా పోతోందని చర్చ నడుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని క్యాడర్‌లో చర్చ నడుస్తోంది. ఆధిపత్య పోరులో భాగంగా ఒక వర్గంపై మరో వర్గం పైచేయి సాధించేందుకు యత్నిస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌ సేవా కార్యక్రమాలతో దూసుకుపోతూ ప్రజలతో మమేకమవుతున్నారు. అయితే నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం వెనుక పార్టీ పెద్దల సపోర్టు ఉందన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సైతం అధిష్టానం వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. మరి బీఆర్ఎస్ అధిష్టానం ఈ వర్గపోరుకు ఎలా చెక్‌ పెడుతుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story