మార్కాపురం వైసీపీలో ముసలం..?

మార్కాపురం వైసీపీలో ముసలం..?
మా ఎమ్మెల్యే, ఆతని సోదరుడు గ్యాంగ్ స్టర్లని వైసీపీ నేత ఆరోపించారా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నేత, ఆతని సోదరుడి అరాచకాలపై సొంత పార్టీ నేతలే దుమ్మెత్తి పోస్తున్నారా. ఎమ్మెల్యే అరాచకాలపై తాడేపల్లి ప్యాలెస్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదా ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? ఏ నియోజకవర్గం అంటారా...?



ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ వైసీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, ఆతని సోదరుడిపై సొంతపార్టీ నేతలే అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యే అక్రమాలపై అధికార పార్టీ నేతలు దుమ్మెత్తి పోయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒంగోలులో వైసీపీ రాష్ట్ర నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ..ఎమ్మెల్యే ఆయన సోదరుడు గ్యాంగ్ స్టర్లని.., తనని చంపడానికి రెక్కీ నిర్వహించారని ఆరోపించడం నియోజకవర్గవంలో సంచలనంగా మారింది. మార్కాపురం నియోజకవర్గంలో వందల ఎకరాల భూమిని ఎమ్మెల్యే కుటుంబం కబ్జా చేసిందని ..వైసీపీ నేత పెద్దిరెడ్డి ఆరోపించడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది.

మార్కాపురంలో నిర్మించనున్న మెడికల్ కాలేజీ సమీపంలోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే కుటుంబం మింగేసిందని వైసీపీ నేత పెద్దిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డి, మామ శ్రీనివాసరెడ్డిలతోపాటు బినామీ పేర్లతో ప్రభుత్వ, పేదల భూములను ఆన్‌లైన్‌ చేయించుకున్నారన్నారు. ఈ అక్రమాలకు సహకరించిన 16 మంది వీఆర్వోలను గత ఏడాది సస్పెండ్‌ చేసింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అవినీతి, భూకబ్జాలపై హైకోర్టును ఆశ్రయించడంతో పాటు సీబీఐ విచారణ జరపాలని వైసీపీ నేత పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలు అవినీతి ఆరోపణలు చేయడం నియోజకవర్గంలో దుమారం రేపుతోంది.

మరోవైపు.., వైసీపీ పార్టీ ఒంగోలు జిల్లా అధ్యక్షులు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి ఇటీవల సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. 2019 ఎన్నికల్లో జంకే వెంకటరెడ్డి సిట్టింగ్ సీట్ ని .. వదులుకోవడం వల్లనే కుందూరు నాగార్జున రెడ్డి ఎమ్మెల్యే అయ్యారని టాక్ నడుస్తోంది. ఆ సమయంలోనే.., వైసీపీ అధికారంలోకి వస్తే జంకె వెంకటరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని వెంకటరెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఇవ్వని పక్షంలో 2024లో మార్కాపురం టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినా.., ఇప్పటి వరకూ జంకేకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అకస్మాత్తుగా కుటుంబ సభ్యులతో .., జంకే వెంకటరెడ్డి సీఎం జగన్‌తో భేటీ కావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు.., అవినీతి ఆరోపణలతో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని.., ఎంపీటీసీ, జడ్పీటీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఒంగోలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి అకస్మాత్తుగా జగన్ కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఈ వరుస పరిణామాలతో కుందూరు కుటుంబానికి ఈ సారి టికెట్ డౌటేనని మార్కాపురంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు అధినేతకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఓ వైపు ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలు నియోజకవర్గాలలో విభేదాలతో నేతలు రోడ్డెక్కడం పార్టీ పెద్దలకు ముచ్చెమటలు పట్టిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story