రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధ్యమేనా..?

రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధ్యమేనా..?
రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఆరుగురు నేతలు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవున్న ఎమ్మెల్యేలు ఎవరు? వ్యతిరేకత ఉన్నా గెలుపుపై ధీమాగా ఉన్నారా? ఓ వైపు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నారా? హ్యాట్రిక్ కొట్టి సత్తా చాటాలనుకుంటున్నారా?

ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే ఒకప్పుడు కమ్యూనిస్టులకు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలకి కంచుకోటగా చెప్పుకునేవారు. రాష్ట్ర విభజన తరువాత సీన్ రివర్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. జిల్లాలో ఉన్న మొత్తం 12 అసెంబ్లీ స్థానాలకుగానూ.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సీట్లను అప్పటి బీఆర్ఎస్ కైవసం చేసుకోగా.. ఐదు స్థానాలకు కాంగ్రెస్, ఒక స్థానంలో సీపీఐ గెలుపొందాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో.. తొమ్మిది స్థానాల్లో TRS గెలవగా.. మూడు సీట్లలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే.. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఆరుగురు నేతలు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిలో సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న గుంటకండ్ల జగదీష్ రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో.. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుల మీద గెలుపొందారు. దాదాపు 5వేల కోట్లతో నియోజక వర్గంలో అభివృద్ది జరిగిందని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, యువనేత పటేల్ రమేష్ ల మధ్య టిక్కెట్ వార్ నడుస్తుండటం.. బీజేపీ నుంచి సంకినేని మళ్లీ బరిలో దిగే అవకాశం ఉండటంతో.. తమ నాయకుడైన మంత్రి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ గెలుపు నల్లేరు మీద నడకేనంటున్నారు బీఆర్ఎస్ క్యాడర్.

ఇక తుంగతుర్తి సెగ్మెంట్ లోనూ.. గతంలో పోలిస్తే పక్కాగా ప్లాన్ తో వెళుతున్నారు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న తుంగతుర్తి నుంచి.. 2014, 2018 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొందారు కిషోర్ కుమార్. ఈసారి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీమంత్రి దామోదర్ రెడ్డి వర్గాలుగా ఉండటంతో.. అది తమకు కలిసి వస్తుందని.. గత తొమ్మిదేళ్ల కాలంలో నియోజకవర్గంలో జాతీయ రహదారులు, అంతర్గత రోడ్లు, కాళేశఅవరం జలాలతో వేలాది ఎకరాల సాగు, ప్రభుత్వ పథకాలు అన్నీ తనకు ప్లస్ పాయింట్లుగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ భావిస్తున్నారట. తుంగతుర్తి నుంచి పక్కాగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటూ గాదరి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి సైతం.. హ్యాట్రిక్ పై గురిపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు బంపర్ మెజారిటీతో శేఖర్ రెడ్డి విజయం సాధించారు. తన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. క్యాడర్ కు అందుబాటులో ఉండటమే కాకుండా వివాదాలకు దూరంగా ఉండటం ఆయనకు కలిసొచ్చేఅంశంగా భావిస్తున్నారు. గతంలో వరుసగా టీడీపీ హవా కొనసాగగా.. 2014 నుంచి పూర్తిగా గులాబీ పార్టీ హవానే నడుస్తోంది. ఇక.. ఆలేరు సెంగ్మెంట్ నుంచి 2014, 2018 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు గొంగిడి సునీత. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. తను ప్రభుత్వ విప్ గా పనిచేస్తుండటం ...భర్త గొంగిడి మహేందర్ రెడ్డి.. డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతుండటం ఆమెకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. సునీత హ్యాట్రిక్ కొడితే మహిళా కోటాలో మంత్రి పదవి రాకపోదా..? అన్న ఓ ఆశతో ఉందట కేడర్.

ఇక.. మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ , సీపీఐ నుంచి గెలిచినప్పటికీ.. 2016లోనే కారెక్కారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు 2014 లో జానారెడ్డి ఆశీస్సులతో.. కాంగ్రెస్ పార్టీ నుంచి మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016లో గులాబీ కండువా కప్పుకోగా.. అప్పటినుంచి తన నియోజకవర్గ అభివృద్దికోసం విశేషంగా కృషి చేస్తున్నారని పబ్లిక్‌లో టాక్ నడుస్తోంది. అక్కడక్కడా పార్టీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. అందరినీ కలుపుకొని వెళ్లడంలో ఆయనకు దిట్ట అని క్యాడర్‌లో టాక్. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భాస్కర్ రావు సైతం తహతహలాడుతున్నారట. దేవరకొండ నుంచి 2014 లో సీపీఐ తరపున గెలిచిన రవీంద్ర కుమార్ నాయక్.. 2016లోనే కారెక్కశారు. ఆతర్వాత 2018 ఎన్నికల్లో రవీంద్రకుమార్ సునాయసంగా విజయం సాధించారు. వచ్చే ఎన్నిక్లలో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నప్పటికీ.. గులాబీ క్యాడర్ ను పట్టించుకోకపోవడం.. పార్టీలోకి వచ్చినప్పటి నుండి ఆర్థికంగా బాగా వేనకేసుకున్నారనీ.. ఆయన గెలుపుకోసం పనిచేసిన నాయకులను పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ నుంచి బలమైన నాయకుడు బరిలో ఉంటే.. ఈసారి రవీంద్రకుమార్ గెలుపు అంతా ఈజీ కాదని క్యాడర్ లో చర్చ జరుగుతోంది. మరోవైపు.. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న దేవరకొండ సీట్.. పొత్తులోభాగంగా సీపీఐ గట్టిగా అడిగే ఛాన్స్ ఉండటంతో.. తన సీటు సీపీఐ ఎగరేసుకు పోతుందని రవీంద్ర నాయక్ కు బెంగ పట్టుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపు దిశగా పలువురు ఎమ్మెల్యేలు పకడ్బంది వ్యూహాలు రచిస్తున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగిస్తూ.. అపోజీషన్ పార్టీ నాయకులతోనూ సత్సంబంధాలు కొనసాగస్తూ.. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని స్కెచ్ వేస్తున్నారు సదరు ఎమ్మెల్యేలు.

Tags

Read MoreRead Less
Next Story