గూడూరు వైసీపీలో ట్రయాంగిల్ వార్..!

గూడూరు వైసీపీలో ట్రయాంగిల్ వార్..!
ఆ నియోజకవర్గంలొ ఆధిపత్యం కోసం వైసీపీ ఎమ్మేల్యే, ఎమ్మేల్సీలు పోటీ పడుతున్నారా..ఎవరికి వారు దర్పం ప్రదర్శిస్తున్నారా

ఆ నియోజకవర్గంలొ ఆధిపత్యం కోసం వైసీపీ ఎమ్మేల్యే, ఎమ్మేల్సీలు పోటీ పడుతున్నారా.. ఎవరికి వారు దర్పం ప్రదర్శిస్తున్నారా సీఎం జగన్ జపం తప్ప ఆ ముగ్గురికి అభివృద్ధి పట్టదా..ఒకరికి ముగ్గురున్న లెజస్లేటివ్ సభ్యులకు ఎవరికి సలాం కొట్టాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారా..

అధికార వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసీపీ గ్రాఫ్ నానాటికి పడిపోతున్నట్లు ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. పార్టీ పరువు పాతాళానికి పడిపోతుంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వ్యక్తిగత స్వార్ధాలకే పెద్ద పీట వేస్తున్నారని క్యాడర్‌లో చర్చ నడుస్తోంది. అందులో గూడురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఒకరికి ముగ్గురు ఉండటంతో ఎవరి మాట వినాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారట. నేను చెప్పిందే చేయాలనే మనస్తత్వం ఒకరిదైతే నేను వచ్చినపుడు అధికారులంతా నాతోనే ఉండాలనే తత్వం మరొకరిది. ఇలా గూడూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు తమ దర్పం ప్రదర్శిస్తూ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను దూరం చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐఏఎస్ గా సుదీర్ఘ అనుభవంతో పాటు ఎంపీగా పనిచేసిన అనుభవం అని చెప్పుకోవడమే తప్ప పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని స్థానిక ఎమ్మేల్యే వరప్రసాద్ పై బహిరంగంగానే సెటైర్లు వేస్తున్నారట. నియోజకవర్గ అభివృద్ధిని పక్కనపెట్టి దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఓ వైపు ఆయనకు ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం అంత ఈజీ కాదనే ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఈ సారి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కొందరు రాదని మరికొందరు బెట్టింగులు కట్టుకోవడం పరిస్థితికి అద్దంపడుతున్నట్లు చర్చ నడుస్తోంది.

దివంగత తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణంతో అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఎన్నికయిన ఆయన తనయుడు బల్లి కళ్యాణ్ కుమార్ కి గూడూరు నియోజకవర్గంలో పట్టు ఉన్నప్పటికీ ఒక వర్గాన్ని మాత్రమే కలవడం వారికి మాత్రమే పనులు చేసిపెడుతుండటంతో అధికారులు, నాయకులు విసిగివేసారి పోయినట్లు సమాచారం. పార్టీకి విధేయుడుగా ఉన్న ఎమ్మెల్సీ మురళి ఆదిలోనే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో అప్పటినుండీ ప్రస్తుత ఎమ్మెల్యేతో అంటిముట్టనట్లుగా ఉంటూ అవకాశం దొరికినప్పుడల్లా ఆయనతో విభేదిస్తూ ఒక వర్గానికి అండగా ఉంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యేతో విభేదిస్తున్న వారంతా ఎమ్మెల్సీ మురళి పక్కన చేరి వారికి కావాల్సిన పనులు చక్కబెట్టుకుంటున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ, పోలీసు అధికారులను ఇబ్బంది పెడుతూ అన్ని విషయాల్లో మాదే పెత్తనం అంటూ భయానక వాతావరణం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. వరప్రసాద్ రావు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పటి నుండి నియోజకవర్గంలో అభివృద్ది పనులు కుంటుపడ్డాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

గూడూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఆడుతున్న మూడు ముక్కలాటతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఎమ్మెల్యేకు పలు గ్రామాల ప్రజల నుండి నిరసన సెగ తగులుతోందట. పర్యటించిన చోటా అభివృద్ది ఏం చేశారో చెప్పాలని ప్రజలు నిలదీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎమ్మెల్సీ మురళి అధికారులతో మీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే.. నేను జిల్లా అంతటికీ ఎమ్మెల్సీని నేను చెప్పిందే చేయాలని నామాట వినకపోతే మిమ్మల్ని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతాను అని హెచ్చరించడంతో అధికారులు ఇదేం ఖర్మరా అని తలలు పట్టుకుంటున్నారట.

Tags

Read MoreRead Less
Next Story