శ్రీకాకుళంలో వైసీపీకి ఎంపీ అభ్యర్థి కరువయ్యాడా?

శ్రీకాకుళంలో వైసీపీకి ఎంపీ అభ్యర్థి కరువయ్యాడా?
శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసేందుకు వైసీపీలో నేతలకు కరువయ్యారా? కింజారపు రామ్మోహన్ నాయుడుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహరచ

శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసేందుకు వైసీపీలో నేతలకు కరువయ్యారా? కింజారపు రామ్మోహన్ నాయుడుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోందా? ఎంపీగా బరిలో దిగేందుకు సీనియర్ నేతలు ఎందుకు జంకుతున్నారు? కొత్త అభ్యర్థి కోసం వైసీపీ అధిష్ఠానం చేస్తున్న అన్వేషణ ఫలిస్తుందా?

శ్రీకాకుళం జిల్లాలో అధికార వైసీపీ విచిత్ర పరిస్ధితిని ఎదుర్కొంటోందట. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పార్లమెంటు స్ధానానికి మాత్రం అభ్యర్ధి కరువయ్యారు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అధికార పార్టీలో సీనియర్లు ఎవరూ పెద్దగా ఆశక్తి చూపటం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో బలమైన అభ్యర్ధి దొరకకపోవటంతో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార పార్టీ బలమైన అభ్యర్ధి కోసం తీవ్రంగానే అన్వేషిస్తున్నారు. గతంలో పోటీ చేసిన కిల్లి కృపారాణి లోక్‌సభకు పోటీ చేసేందుకు పెద్దగా ఇంటరెస్ట్ చూపించకుండా రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకోవడంతో...జగన్ చివరి నిమిషంలో హ్యండ్ ఇచ్చారు. దీంతో ఇక కృపారాణి ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై చెప్పేసినట్టేనని అధికార పార్టీలో ప్రచారం జరుగుతోందట. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు వైసీపీ అభ్యర్ధిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్తి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పీడుకు దువ్వాడ పరాజయం పాలయ్యారు. అనంతరం వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ కట్టబెట్టింది. దీనికి తోడు దువ్వాడ వచ్చే ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనను టెక్కలి ఇన్‌ఛార్జిగా నియమించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీ తరపున సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా ఎవరు బరిలో దిగుతారోనన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఎంపీగా బరిలో దిగేందుకు సీనియర్లు ఆశక్తి చూపకపోవటం వైసీపీకి ఇబ్బందికరంగా మారిందట. ప్రజాబలం లేని పలువురు నేతలు టికెట్ ఆశిస్తున్నప్పటికీ వారికి అంత సీన్ లేకపోవటంతో వైసీపీ హైకమాండ్ కు అభ్యర్ధి ఎంపిక పెద్ద సవాల్ గా మారింది. సీనియర్లుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు కృష్ణదాసుల్లో ఒకరిని పార్లమెంటుకు పంపాలని వైసీపీ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఇరువురు నేతలూ ఎంపీగా పోటీ చేసేందుకు అంతగా ఆశక్తి చూపటం లేదని అంటున్నారు. టీడీపీ అభ్యర్ధి రామ్మోహన్ నాయుడును రాజకీయంగా ఎదుర్కోవాలంటే జిల్లాలో ఉన్న సీనియర్లలో ఎవరినో ఒకరిని పార్లమెంటు బరిలో దింపాల్సిందేనన్న చర్చ పార్టీలో సాగుతోంది. అయితే అభ్యర్ధి కోసం తీవ్ర కసరత్తు చేస్తున్న వైసీపీ పెద్దలు చివరినిమిషంలో ఎవరిని బలిపశువుని చేస్తారోనన్న టెన్షన్ జిల్లా నేతలను వెంటాడుతోంది.

శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందిన కింజారపు రామ్మోహన్ నాయుడు రెండు సార్లు గెలుపొందారు. తన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు జిల్లాలోని అన్ని వర్గాలతో కొనసాగించిన సత్సంబంధాలు రామ్మోహన్ నాయుడుకి ఉపయోగపడుతోంది. దీనికితోడు రామ్మోహన్ నాయుడు ఇమేజ్ , ఆయన వాక్పటిమ, పనితీరు టీడీపీకి మరింత బలంగామారింది. రామ్మోహన్ నాయుడును ఓడించటం ప్రత్యర్ధి పార్టీలకు పెద్ద సవాల్ గా మారింది. చిన్న వయసులో ఎంపీగా రెండుసార్లు విజయం సాధించిన రామ్మోహన్ నాయుడు పార్లమెంటులోనూ అనేకసార్లు తన ప్రతిభను చాటుకున్నారు. మరోవైపు జిల్లాలో తన తండ్రి దివంగత ఎర్రన్న మాదిరిగానే రామ్మోహన్ నాయుడు సైతం జిల్లా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.

టీడీపీ అభ్యర్ధి రామ్మోహన్ నాయుడును ఎదుర్కోవాలంటే వైసీపీకి బలమైన అభ్యర్ధి కావాలి. కానీ ఇపుడున్న నేతలెవరూ పోటీకి ముందుకు రావటం లేదని టాక్ వినిపిస్తోంది. దీంతో సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాకు చెందిన సీనియర్లలో ఎవరినో ఒకరిని పార్టీ పెద్దలు తెరమీదికి తెస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story