ఉమ్మడి ప్రకాశంలో వైసీపీకి ఝలక్

ఉమ్మడి ప్రకాశంలో వైసీపీకి ఝలక్
రాబోయే ఎన్నికల్లో వైసీపీకి గడ్డుపరిస్థితులు తప్పవా? చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో ఫ్యాను రెక్కలు ఊడిపోనున్నాయా? ఆ మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఇచ్చిన షాక్‌కి వైసీపీ దిమ్మ తిరిగిందా ? పవన్‌తో ఆమంచి స్వాములు భేటీతో జిల్లా రాజకీయాల్లో మార్పులు తప్పవా ?

రాబోయే ఎన్నికల్లో వైసీపీకి గడ్డుపరిస్థితులు తప్పవా? చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో ఫ్యాను రెక్కలు ఊడిపోనున్నాయా? ఆ మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఇచ్చిన షాక్‌కి వైసీపీ దిమ్మ తిరిగిందా ? పవన్‌తో ఆమంచి స్వాములు భేటీతో జిల్లా రాజకీయాల్లో మార్పులు తప్పవా ?

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం చిన్న బొంబాయిగా ఖ్యాతి గడిచింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ నియోజకవర్గంలో వైసీపీ ఇంత వరకూ విజయం సాధించలేదు. ఈసారన్నా విజయం సాధించాలని ఆ పార్టీ వ్యూహ రచన చేస్తుంటే.., వైసీపీ పర్చూరు ఇంఛార్జి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు.., ఆమంచి స్వాములు వైసీపీ పెద్దలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత లభించలేదని భావిస్తున్న స్వాములు తన రాజకీయ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో స్వాములు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో కాకరేపుతోంది. స్వాములు జనసేనలో చేరనున్నారనే ప్రచారం జరుగుతుండటంతో చీరాల రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది.

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.., మాజీ సీఎం కొణిజేటి రోశయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో చీరాల నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై విజయం సాధించారు. 2014 ఎన్నికలలో ఇండిపెండెంట్ గా అనూహ్య విజయాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీలో చేరి... 2019 ఎన్నికలకు ముందు వైసీపీ బాట పట్టారు. కృష్ణమోహన్ విజయంలో.., ఆమంచి స్వాములు కీలక పాత్ర పోషించారని నియోజకవర్గంలో అప్పట్లో ప్రచారం జరిగింది. చీరాలను తమ కంచుకోటగా మార్చుకున్న అన్నదమ్ములకు 2019లో కరణం బలరాం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన కరణం బలరాం ..,ఆమంచి కృష్ణమోహన్‌ని ఓడించి.., ఆ తర్వాత వైసీపీలో చేరడంతో వారికి ఫ్యాను పార్టీలో ఉక్కపోత మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది.

ఉమ్మడి ప్రకాశంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పర్చూరు నియోజకవర్గ బాధ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చీరాలలో వైసీపీ తరఫున తన తమ్ముడు కృష్ణమోహన్ పోటీచేస్తే.., తను పర్చూరు నుంచి పోటీచేయాలని స్వాములు ఆలోచనలో ఉన్నారు. కానీ కరణం రాకతో వారి ఆశలు అడి ఆశలు అయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధిష్టానం కూడా చీరాల టికెట్ కరణం కుటుంబానికే అని స్పష్టం చేయడంతో పాటు.., ఆమంచి కృష్ణమోహన్ ని పర్చూరు వైసీపీ ఇంఛార్జిగా నియమించడంతో.., స్వాములు షాక్ తిన్నట్లు తెలుస్తోంది. ఇక తన దారి తాను చూసుకోవడం మేలని భావించిన స్వాములు జనసేనకు జై కొట్టడానికి సిద్ధమయినట్లు క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. పవన్‌తో భేటీ అనంతరం ఆమంచి స్వాములు జనసేనలో చేరడం లాంఛనమేనన్న టాక్ వినిపిస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీకి చీరాల,పర్చూరు నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితులు తప్పవని వైసీపీ నేతలే చెవులు కొరుక్కొంటున్నారు.

దీంతోపాటు.., జనసేనలో చేరిన వెంటనే స్వాములుకు బాపట్ల జిల్లాలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల చీరాలతో పాటు.., పర్చూరులోనూ వైసీపీకి ఇబ్బందులు తప్పవని ఆపార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పర్చూరు నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం తర్వాత.., కాపు సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. దీనివల్ల కాపు సామాజికవర్గానికి చెందిన ఆమంచి స్వాములు, జనసేన ప్రభావంతో కాపులు వైసీపీకి దూరం అయితే.., అక్కడ సైకిల్ పార్టీ అభ్యర్థికి గెలుపు నల్లేరు మీద నడకేనన్న ప్రచారం ఇప్పటికే మొదలైంది.

జనసేన పార్టీలో ఆమంచి స్వాములుతో పాటు, ఆతని కుమారుడు రాజేంద్ర కూడా జాయిన్ కానున్నారు. దీంతో ఆమంచి వర్గంలో చీలిక తప్పేలా లేదు. తన సోదరుడు కృష్ణమోహన్‌ వైసీపీ పర్చూరు నియోజకవర్గ బాధ్యుడిగా కొనసాగుతున్న సమయంలోనే స్వాములు పవన్‌ కల్యాణ్‌ను కలవడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఇది అటు తిరిగిఇటు తిరిగీ చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో ఫ్యాను పుట్టిముంచనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story