వెంకటగిరి వైసీపీలో మహిళా నేతలకు అవమానాలు

వెంకటగిరి వైసీపీలో మహిళా నేతలకు అవమానాలు
వెంకటగిరి వైసీపీలో మహిళా ప్రజాప్రతినిధులంటే చిన్న చూపా అధికారిక కార్యక్రమాలకు సైతం సమాచారం ఇవ్వడంలేదా?


వెంకటగిరి వైసీపీలో మహిళా ప్రజాప్రతినిధులంటే చిన్న చూపా అధికారిక కార్యక్రమాలకు సైతం సమాచారం ఇవ్వడంలేదా? సొంత పార్టీ నేతలే విలువ ఇవ్వడంలేదా? అధికారులు కూడా వివక్ష చూపుతున్నారా?

వెంకటగిరి నియోజకవర్గ వైసీపీకి దిశా నిర్దేశం చేసే నేతలు కరువయినట్లు టాక్ వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుండి దూరం కావడంతో వెంకటగిరిలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుందని గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నేతలు భావిస్తున్నారు. సరైన నాయకుడు లేకపోవడంతో వైసీపీ నేతలు వివక్షకు, వేధింపులకు గురతున్నారని వెంకటగిరి నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కల్పించిన మహిళా రిజర్వేషన్లతో రాజకీయాల్లో రాణించాలని వచ్చిన మహిళా నేతలు వైసీపీలో తీవ్ర అణచివేతకు గురౌతున్నట్లు వెంకటగిరిలో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటీవల వెంకటగిరి ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో వైసీపీ మండల అధ్యక్షురాలు తంబిరెడ్డి తనుజరెడ్డికి అధికారులు కనీస గౌరవం ఇవ్వలేదని జోరుగా ప్రచారం జరుగుతోంది.తను సమావేశానికి, స్పందనకి పిలిస్తే అధికారులు ఎందుకు రావడంలేదో అర్ధంకావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో మహిళా నేత ఉప్పరపల్లి సర్పంచ్ విజయలక్ష్మి తమని నడిపించే నాయకుడు లేకపోవడం ఆవేదనగా ఉందని.. నిస్వార్దంగా పని చేస్తున్న తమలాంటి వారికి పార్టీలో కనీస గౌరవం దక్కడంలేదని ఆవేదన వెలిబుచ్చారు.

వైసీపీ మహిళ ప్రజాప్రతినిధులుగా జగన్ సభకు వస్తే మమ్మల్ని పట్టించుకునే వారే లేరని మాగోడు ఎవరికి చెప్పుకోవాలని ఎంపిపి, సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మహిళా నేతలను ఏకాకి చేస్తున్న వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మహిళా నేతలు విమర్శలు విరుచుకుపడుతున్నారు. వైసీపిలో మహిళా నేతలకు తీవ్ర అవమానాలు జరుగుతున్నా పార్టీ పెద్దలు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.

వెంకటగిరిలొ మరో ప్రజాప్రతినిధి సైదాపురం మండలం కమ్మవారిపల్లి వైసీపీ వార్డ్ మెంబర్ సునీతమ్మ.. నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లెక్సీలు కట్టేంతవరకూ తమ వద్దకు రాంకుమార్ రెడ్డి వస్తున్న విషయం కూడా తెలియదని రాంకుమార్ రెడ్డినే మహిళా నేతలు నిలదీశారు. వెంకటగిరి నియోకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా నియోజకవర్గ ఇంచార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి అడుగడుగునా సొంత పార్టీ నేతల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని గడపగడప కార్యక్రమాల్లో నిలదీస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నియోజకవర్గంలో ఎదురవుతున్న పరిణామాలకు ఇంఛార్జి రాంకుమార్ రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు తెలుస్తోంది. గడప గడపలో ఎదురవుతున్న నిరసనలు, వివక్షకు గురవుతున్న పార్టీ మహిళా నేతలు చేస్తున్న విమర్శలతో పార్టీ పరువు దిగజారిపోయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story