Kurnool: కర్నూలు అర్బన్ వైసీపీలో టికెట్ కోసం కుమ్ములాటలు

Kurnool: కర్నూలు అర్బన్ వైసీపీలో టికెట్ కోసం కుమ్ములాటలు
కర్నూలు వైసీపీలో టికెట్ వార్ మొదలయిందా? సిట్టింగులతో పాటు ఆశావహులు పోటీపడుతున్నారా? టికెట్ ప్రయత్నాలతో నేతల మధ్య కుమ్ములాటలు ప్రారంభమయ్యాయా? టికెట్ కోసం పావులు కదుపుతున్న ఆశావహులెవరు? వైసీపీలో గ్రూప్ వార్‌తో సైకిల్ దూసుకుపోతోందా? సైకిల్ స్పీడుతో వైసీపీ నేతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారా?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీలో టికెట్ వార్ మొదలయింది. కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఎవరి నోట విన్నా కర్నూలు ఆర్బన్ సెగ్మెంట్ గురించే చర్చ జరుగుతోంది. ఇందుకు అధికార పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణంగా తెలుస్తోంది. అయితే కర్నూలు వైసీపీ టికెట్ రేసులో తాజా మాజీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ కు టికెట్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి దంపతులు హఫీజ్ గెలుపు కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. జగన్ ఒక్క ఛాన్స్ నినాదంతో జిల్లాలోని ఎమ్మెల్యే స్థానాలన్నీ గెలుపొందారు. అయితే కర్నూల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గట్టి పోటీ ఇవ్వడంతో హఫీజ్ ఖాన్ స్వల్ప మెజార్టీతో బయట పడగలిగారు.

అయితే ఎన్నికల తరువాత హఫీజ్, ఎస్వీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు రాజుకోవడంతో పార్టీ రెండు వర్గాలు గా చీలిపోయింది. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇరువురు నేతలు టికెట్ కోసం నువ్వా నేనా అంటు పోటీ పడుతున్నారు..సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాత్రం ముస్లిం మైనార్టీ కోటా నుంచి మరో ఛాన్సివ్వమని కోరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకున్నా పార్టీ విజయం కోసం కృషిచేశామని ఈ నేపథ్యంలో టికెట్ మాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి సతీమణి విజయమనోహరి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆర్బన్‌లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో ఎస్వీ దంపతులు పాల్లొంటున్నారు. దంపతులిద్దరిలో టికెట్ ఎవరికి ఇచ్చినా పర్వాలేదని పార్టీ పెద్దలకు చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఎస్వీ విజయ మనోహరికి పార్టీ హై కమాండ్ కేడిసీసీబి చైర్మన్ పదవిని కేటాయించింది. దీంతో ఎస్వీ మోహన్ రెడ్డి వర్గానికి ఇక టికెట్ ఉండదన్న పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం టికెట్ విషయంలో వెనక్కు తగ్గేది లేదని సన్నిహితుల వద్ద చెబుతున్నారు.

తాజాగా ముస్లిం మైనార్టీ సామాజిక వర్గం నుండి ఎంఎస్‌ఏ మోటార్స్ అధినేత మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అహ్మద్ అలీఖాన్ జగన్ సమక్ష్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తారనే గ్యారెంటీతోనే అహ్మద్ అలీఖాన్ వైసీపిలో చేరినట్లు సొంత పార్టీ క్యాడర్‌లో చర్చ సాగుతోంది. ఇంకో వైపు ఇదే టికెట్ కోసం పులివెందుల డెవలప్‌మెంట్ అథారిటీలో అధికారిగా పనిచేస్తున్న బషీర్ అహ్మద్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ టికెట్ హామీ ఇస్తే ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి రావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరికి తోడు మరికొంత మంది ఆశావహులు టికెట్ కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపిలో టికెట్ కుమ్ములాటలు ఈ విధంగా ఉంటే.మున్సిపల్ వార్డుల్లో సైకిల్ స్పీడు పెరిగిందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఇంచార్జ్ టీజీ భరత్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. తాజాగా టీజీ భరత్ తన వ్యూహాలకు పదును పెట్టి సైలెంట్‌గా పనిచేసుకు పోతున్నారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడంతో పాటు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ భవిష్యత్‌కు గ్యారెంటీ పథకాలను వివరిస్తున్నారు. మరోవైపు అధికార వైసీపీ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైసీపి నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గడప గడపలో సమస్యలపై నిరనలు, నిలదీతలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు సైకిల్ స్పీడ్‌తో దిక్కుతోచని స్థితిలో పడుతన్నట్లు చర్చ సాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story