Editorial: రామచంద్రపురం వైసీపీలో వారసత్వ పోరు?

Editorial: రామచంద్రపురం వైసీపీలో వారసత్వ పోరు?
ఆ నియోజకవర్గ వైసీపీలో వారసత్వ పోరు రాజుకుందా? కుమారుల పొలిటికల్ ఎంట్రీకి తండ్రులు స్కెచ్ వేశారా? పై చేయి సాధించేందుకు ఇరువురు నేతలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారా? వారసత్వ పోరే నియోజకవర్గ వైసీపీలో విభేదాలకు కారణమా?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీలో కుమ్ములాటలు ఎక్కువయినట్లు తెలుస్తోంది. విపక్షాలు ప్రజల్లోకి వెళుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే అందుకు భిన్నంగా అధికార పార్టీలో వర్గ విభేదాలు నిత్యం భగ్గుమంటున్నాయి. వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు గ్రూపులుగా విడిపోయి వాగ్వాదాలు, పరస్పర ఆరోపణలకు దిగుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రామచంద్రపురం నియోజకవర్గంలో వారసుల కోసం మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ఎంపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌ వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తనయుడ్ని ఎన్నికల బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై బోసు వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తనయుడిపై ఆరోపణలు చేస్తూనే... ఈసారి బోస్‌ కుమారుడికి టికెట్‌ ఇచ్చి తీరాలని పట్టుబడుతున్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ పార్టీలో వర్గాలు ఏమీలేవని, అంతా జగన్‌ వర్గమేనని కొట్టిపారేశారు.

వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసం ఎంపీ బోసు, మంత్రి వేణుగోపాల కృష్ణలు చేస్తున్న ప్రయత్నాలు రామచంద్రాపురం నియోజకవర్గ వైసీపీలో వర్గపోరుకు తెరలేపింది. ఇటీవల రాజమహేంద్రవరంలో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల పరిశీలకుడు మిథున్‌రెడ్డి ఎదుటే ఇద్దరు యువ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇది మరిచిపోకముందే మళ్లీ రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వేణుకు వ్యతిరేకంగా ఎంపీ బోసు అనుచరులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి మంత్రి తీరును ఎండగట్టారు. బోస్‌ వర్గీయులుగా గుర్తింపు పొందిన ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను మంత్రి వేణు కనీసం కార్యాలయానికి సైతం రానీయడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో బోసు వర్గీయులు మంత్రిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బోసు తనయుడు సూర్యప్రకాశ్‌కు టికెట్‌ ఇవ్వకపోతే మంత్రి వేణుగోపాలకృష్ణను ఓడించి తీరుతామని బోసు వర్గీయులు హెచ్చరించినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.

మంత్రి తనయుడు నరేన్‌ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతోపాటు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ, క్యాడర్‌పై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గం నుండి మళ్లీ పోటీ చేయాలనే యోచనలో వేణుగోపాలకృష్ణ ఉన్నట్లు టాక్ వినిపిస్తున్నా ఎన్నికల నాటికి వారసుడ్ని బరిలో దింపుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బోసు తనయుడు సూర్యప్రకాశ్‌కు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కుమారుడ్ని రాజకీయాల్లోకి తేవాలన్న తపన ఉన్నప్పటికీ ఎంపీ బోసు మాత్రం తన వైఖరిని ఇంతవరకూ ఎక్కడా వెల్లడించలేదు. అయితే ఈ అంశాన్ని బోసు అనుచరులు నెత్తికెత్తుకుని ప్రచారం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బోసు తనయుడు సూర్యప్రకాశ్‌ రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా రామచంద్రపురం బరిలో దిగుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు పిల్లి సుభాష్ చంద్ర బోసే అనుచరులతో లీకులు ఇప్పిస్తున్నారని మంత్రి అనుచరులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల వైఎస్‌ జయంతిలో పాల్గొన్న ఎంపీ బోసు ఎదుట ఆయన అభిమానులు సూర్యప్రకాశ్‌ రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని, ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని ప్రకటించడం వైసీపీలో దుమారం రేపుతోంది. దీంతో అప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. ద్రాక్షారామంలో జరిగిన ఆత్మీయ సమావేశం బోసు తనయుడు సూర్య ప్రకాష్ అండతోనే జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఈ భేటీలో పార్టీకి చెందిన ముఖ్య నేతలు పొల్గొననప్పటికీ నియోజకవర్గస్థాయి నాయకులు మాత్రం మంత్రి వేణుగోపాల కృష్ణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వారసత్వ పోరులో ఎవరికి టికెట్ లభిస్తుందో ఎన్నికల వరకు వేచిచూడాల్సిందే

Tags

Read MoreRead Less
Next Story