రీఎంట్రీకి గల్లా అరుణకుమారి సన్నాహాలు

రీఎంట్రీకి గల్లా అరుణకుమారి సన్నాహాలు


కొద్ది నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యాక్టివ్ అయ్యేందుకు పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. పలు కారణాలతో సైలెంట్‌గా ఉన్న నేతలు రాబోయే రోజుల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి గ‌ల్లా అరుణ‌ కుమారి పొలిటిక‌ల్ రీ ఎంట్రీకి రోడ్ మ్యాప్‌ ను సిద్ధం చేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గల్లా అరుణ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 2014కు ముందు వ‌ర‌కు కూడా ఆమె కాంగ్రెస్‌ లో సుధీర్గకాలం పాటు కొన‌సాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భూగర్భ, గనులశాఖ‌ మంత్రిగా ప‌నిచేశారు. దివంగ‌త ఎంపీ సామాజిక కార్యకర్త పటూరి రాజ గోపాల నాయుడు కుమార్తెగా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన అరుణ కుమారి చిత్తూరు జిల్లాలో కీల‌కంగా వ్యవహరించారు.

చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలో గల్లా ఫ్యామిలీకి రాజకీయంగానే కాకుండా పారిశ్రామికంగా బలంగా ఉండటంతో ప్రత్యేక ఓటు బ్యాంకు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందు ఆమె కాంగ్రెస్‌ ను వీడి తెలుగుదేశంలో చేరారు. టీడీపీ అభ్యర్థిగా చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. దీంతో ఆమె అప్పటి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఓటమి అనంతరం పూర్తి సమయాన్ని వ్యాపారాల కోసం కేటాయిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే పార్టీ కార్యక్రమాల‌కు దూరంగానే ఉంటున్నారు.


ఆమె రాజకీయాలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు నుండి టీడీపీ ఎంపీగా కొనసాగుతుండటమేనని క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. దీంతో ఎవ‌రో ఒక‌రు ఫ్యామిలీ నుంచి రాజ‌కీయాల్లో ఉన్నారని చెబుతున్నారు. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా ప్రత్యక్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని చంద్రబాబుకు తెల‌ప‌డంతో నియోజ‌క‌వ‌ర్గ బాధ్యత‌లను పులిప‌ర్తి నానికి అప్పజెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.


తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మ‌ళ్లీ చంద్రగిరి నుంచి ప్రత్యక్ష రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌ని గల్లా అరుణ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే విష‌యమై ఇటీవ‌ల త‌న స‌న్నిహితుల వద్ద ప్రస్తావించడంతో ఈ వ్యవహారం జిల్లా రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌ గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story