Editorial: విజయనగరం వైసీపీలో బీసీల కథ కంచికేనా...?

Editorial: విజయనగరం వైసీపీలో బీసీల కథ కంచికేనా...?
X
కొద్ది కాలం క్రితం అసమ్మతి బావుటా ఎగరేసిన బీసీ నేతలు మౌనం వహించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది

ఆ నియోజకవర్గ టికెట్ బీసీలకే ఇవ్వాలంటూ బీసీ నినాదాన్ని తెరమీదకు తెచ్చిన నేతలు సైలెంట్ అయ్యారా?
మళ్లీ టికెట్ ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడిస్తామన్న నేతలు ఏమైపోయారు?
అసమ్మతి బావుటా ఎగరేసిన నేతలు కనుమరుగయ్యారా?
బీసీ నేతల మధ్య విభేదాలు పొడచూపాయా?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టికెట్ కోసం ఆశావహులు కసరత్తు ప్రారంభించారు. పలు నియోజకవర్గాలలో అధికార వైసీపీలో టికెట్ కుమ్ములాటలు ఎక్కువయినట్లు టాక్ వినిపిస్తోంది. తమ కులానికే ఈ సారి టికెట్ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొద్ది కాలం క్రితం అసమ్మతి బావుటా ఎగరేసిన బీసీ నేతలు మౌనం వహించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విజయనగర నియోజకవర్గ వైసీపీలో ఏర్పడ్డ వర్గపోరు బీసీ నినాదానికి తెర తీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏడాది క్రితం రాబోయే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికే టికెట్ కేటాయించాలంటూ నియోజకవర్గ వైసీపీ సీనియర్ నేతలు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్‌లు డిమాండ్ చేశారు. దీనికి సంఘాభావంగా జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేసి ర్యాలీలు, సమావేశాలు కూడా చేపట్టారు. పార్టీ పెద్దలకు తమ డిమాండ్ విషయాన్ని చేరవేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఏడాది క్రితం డిమాండ్ చేసిన నేతలు ప్రస్తుతం సైలెంట్ అయిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి వ్యతిరేకంగా గళాన్ని వినిపించిన ఆ ఇద్దరు నేతలు ఎక్కడ ఉన్నారో, ఏమి చేస్తున్నారో తెలియడం లేదని క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. దీంతో బీసీ నినాదం గాల్లో కలిసి పోయిందంటూ కోలగట్ల వర్గీయులు హేళన చేస్తున్నారు. మూడు నాళ్ళ ముచ్చటగా కార్యక్రమాలు చేపట్టి చేతులు దులువుకోవడం తప్ప చేసిందేమీ లేదంటూ ఎద్దేవా చేస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా తమ నేతకే టికెట్ వస్తుందని కోలగట్ల వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విజయనగరం నియోజకవర్గం జనరల్ రిజర్వేషన్ కేటగిరి కిందకు రావడంతో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోలగట్ల వీర భద్ర స్వామి ఆర్యవైశ్య సామాజిక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో వయోభారం నేపథ్యంలో తన కుమార్తె కోలగట్ల శ్రావణిని రంగంలోకి దించేందుకు పావులు కదిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో నగర డిప్యూటీ మేయర్ గా గెలిపించి రాజకీయ ఆరంగ్రేటం చేయించారు. అఇయతే వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్‌లు ఇచ్చేది లేదంటూ అధినేత కోలగడ్ల ఆశలకు కళ్లెం వేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో తానే మళ్లీ తనే బరిలో దిగుతానని కోలగట్ల వీరభద్ర స్వామి క్యాడర్‌కు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోలగట్లకు కాకుండా నియోజకవర్గంలో అధికంగా ఉన్న బీసీలకు టికెట్ కేటాయించాలంటూ వైసీపీ లోని బీసీ నేతలు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్‌లు అసమ్మతి గళం వినిపించారు. వర్గపోరు తారాస్థాయికి చేరడంతో విజయనగరం వైసీపీలో బీసీలకు ఆర్యవైశ్యులుగా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఏడాది క్రితం బీసీ నినాదం అందుకున్న నేతలు ఏడాది తిరిగేసరికి పత్తా లేకుండా పోయినట్లు క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కర్త , కర్మ, క్రియ గా వ్యవహరించిన అసమ్మతి నేతలు ఇద్దరూ మంత్రి బొత్స సత్యనారాయణ అనుచరులు కావడంతో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ బీసీ శ్రేణుల నుండి సహకారం అంతంత మాత్రంగా ఉండటంతో నినాదం చప్పబడిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు బీసీ నినాదానికి సరైన కార్యాచరణ, విధి విధానాలు లేకపోవడంతో ఒక ముఖ్య నాయకుడు సైలెంట్ అయిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ఏళ్ళ తరబడి పార్టీ కోసం కష్టపడి ఆస్తులు పోగొట్టుకున్నా... పార్టీ గుర్తించడంలేదని పార్టీకి, పార్టీ నేతలకు వ్యతిరేకంగా పని చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు సదరు ఎమ్మెల్యే కూడా అసమ్మతి నేతకు రాయబారం పంపినట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ నినాదం వలన ఉపయోగం లేదని తనకు మద్దతు తెలిపితే ఏదైనా పదవి లభిస్తుందని నచ్చజెప్పినట్లు సమాచారం.

దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే తో నడిస్తే భవిష్యత్‌లో తనకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయని భావించడంతో బీసీ నినాదం అటకెక్కినట్లు తెలుస్తోంది. దీంతో బీసీ నినాదం తలకెత్తుకున్న నేతల్లో ఒకరి చల్లబడగా మరొకరు సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.

Tags

Next Story