Agnus Cloud: యుఫోరియా నటుడు ఆగ్నస్ మృతి, వారం క్రితమే తండ్రి కూడా
Agnus Cloud: హాలివుడ్ యువ నటుడు ఆగ్నస్ క్లౌడ్ అకస్మాత్తుగా మరణించాడు. 25 యేళ్ల ఆగ్నస్ ప్రముఖ వెబ్ సిరీస్ యుఫోరియాలో(Euphoria) నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికాలోని ఓక్లాండ్‌లో తన ఇంట్లోనే కన్నుమూశాడని కుటుంబీకులు వెల్లడించారు. ఇంకా విషాదకరం ఏంటంటే ఆగ్నస్ తండ్రి కూడా గత వారమే కన్నుమూశాడు. ఇదే అతన్ని ప్రభావితం చేసిందని అనుకుంటున్నారు. అయితే మృతికి గల కారణాలను ఇంకా ఎవరూ ధృవీకరించలేదు.
HBOలో ప్రసారమయ్యే యుఫోరియా(Euphoria) వెబ్ సిరీస్‌లో ఫెజ్‌కో అనే పాత్రలో డ్రగ్ డీలర్‌గా ఉంటూ తన విలక్షణమైన నటన, మాట తీరుతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో ప్రముఖ నటి జెండాయా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సిరీస్‌కి ముందు అతనికి ఎటువంటి సినిమాల్లోనూ నటించలేదు. తన నటనతో IMDBలో 6 రేటింగ్ తెచ్చుకున్నాడు. మొదటి సారిగా 'ద లైన్' అనే సినిమాలోనూ నటించాడు.
వారం క్రితం తండ్రి మరణానంతరం ఐర్లాండ్‌లో అంత్యక్రియలు నిర్వహించి, అమెరికాలోని ఓక్లాండ్‌లోని ఇంటికి వచ్చాడు. తండ్రి మరణంతో కుమిలిపోవడంతో ఆ ప్రభావం తీవ్రంగా పడిందని కుటుంబీకులు వెల్లడించారు. ఇంతకు ముందు పలు మానసిక సమస్యలతోనూ బాధపడుతున్నట్లు వారు వెల్లడించారు.దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు.
"ఒక మంచి మనిషికి బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలుకుతున్నాము. ఆగ్నస్ ఒక స్నేహితుడిగా, సోదరుడిగా, కొడుకుగా ఎన్నో రకాలుగా మాకు ప్రత్యేకం,"
"ఆగ్నస్ గత వారం తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తండ్రి మరణంతో తీవ్రంగా కుమిలిపోయాడు. బెస్ట్‌ఫ్రెండ్ లాంటి తన తండ్రి వద్దకే అతను చేరుకున్నాడు. ఆగ్నస్ పడిన మానసిక క్షోభ, మానసిక సమస్యలపై ఎల్లపుడూ బహిరంగంగానే ఉండేవాడు. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఒంటరిగా భావించకుండా ఇతరులతో పంచుకోండి"
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com