A.R. Rahman : అందుకే విడిపోయాం.. ఏఆర్ రెహమాన్ స్పందన

ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాబాను మధ్య విడాకులు అంతటా హాట్ టాపిక్ గా మారింది. డివోర్స్ విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఎక్స్ వేదికగా స్పందించారు. "మేం సంతోషంగా ముప్పైకి చేరుకోవాలని ఆశించాము. కానీ అన్ని విషయాలు కనిపించని ఒక ముగింపును కలిగి ఉంటాయని తెలిసింది. ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడి సింహాసనం సైతం వణుకుతుంది. అయినా ఈ ముగింపులో మేము మరో అర్థాన్ని వెతుకుతున్నాము. విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా కనిపించవు" అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఏఆర్ రెహమాన్. సైరాతో గడిపిన మూడు దశాబ్దాల జీవితాన్ని ముగించడంపై రెహమాన్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. రెహమాన్ భార్య సైరాబాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆమె తరపు లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికి రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీరిద్దరు విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన కలహాలు అని.. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ.. తమ మధ్య ఏర్పడిన ఇబ్బందులను అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని లాయర్ వందనా షా తెలిపారు. అభిప్రాయబేధాల కారణంగానే ఇద్దరి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com