Minister Vakiti Srihari : బనకచర్ల ఎప్పుడైనా చర్చకు సిద్ధం.. బీఆర్ఎస్ కు మంత్రి సవాల్

Minister Vakiti Srihari : బనకచర్ల ఎప్పుడైనా చర్చకు సిద్ధం.. బీఆర్ఎస్ కు మంత్రి సవాల్
X

బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్ తీరును మంత్రి వాకిటి శ్రీహరి ఖండించారు. కాంగ్రెస్ దే తప్పన్నట్లుగా ఆ పార్టీ నేతలు మాట్లాడడం సరికాదన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు ఎప్పుడైనా,ఎక్కడైనా చర్చకు సిద్ధమని సివాల్ విసిరారు. అప్పటి ఏపీ సీఎం జగన్‌తో కలిసి.. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని కేసీఆర్‌ చెప్పలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్, హరీశ్‌రావులు సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారాయని.. వారి వల్లే ఏపీ ప్రభుత్వం బనకచర్లను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ తన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని మంత్రి శ్రీహరి అన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కానీ బీజేపీ బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపిస్తోందని విమర్శించారు. రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ విషయంలోనే బీసీల పట్ల ఆ పార్టీ వైఖరేంటో అర్ధమవుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై రైల్‌ రోకో చేస్తానంటున్న ఎమ్మెల్సీ కవిత... ముందుగా ఆ పార్టీ అధ్యక్ష పదవి లేదా కార్యనిర్వాహక అధ్యక్ష పదవైనా బీసీలకు వచ్చేలా చూస్తే బాగుంటుందని మంత్రి చురకలు అంటించారు.

Tags

Next Story