Editorial : గవర్నెన్స్ లో గవర్నర్ల పరిధి, పరిమితులేంటి!
hyderabad
తమిళనాడులో గెట్ఔట్ రవి అనే పోస్టర్లు వెలిశాయి. ఇదే ట్విట్టర్ లో హాష్‌ట్యాగ్ ట్రెండింగులో వుంది. ఇంతలా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వ్యక్తి ఓ రాష్ట్ర గవర్నర్ అవడం నిజంగా విచారకరం. గవర్నర్ పదవిలో వున్న వారిపై కోర్టులో సైతం అభియోగాలు మొపలేని ఇమ్యూనిటీ ఆ పదవికి వుంటుంది. అంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్దలో గవర్నర్ కు మన రాజ్యాంగం ఎంతటి హోదా గౌరవం కల్పించిందో అర్ధంచేసుకోవచ్చు.
కేవలం తమిళనాడు గవర్నర్ మాత్రమేకాదు.. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ లు కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదించి పలు విమర్శలు ఎదుర్కొన్నారు. అంతకు ముందు మహారాష్ట్ర గవర్నర్ భగతి సింఘ్ కోషియారీ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ గావున్న ఇప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ఢిల్లీ, పుదుచ్చెరి రాష్ట్రాల లెఫ్టినెంట్ గవర్నర్లు అందరూ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలన్న విమర్శలెదుర్కొన్నవారే.
ఎన్నుకోబడ్డ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను, క్యాబినెట్ సలహా సూచనలు పాటించాలన్న రాజ్యాంగ స్పూర్తినీ వీరు కాలరాశారనీ ఆయా సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఆరోపణలు చేశాయి. పరిపాలనలో కార్యనిర్వహణ అధికారాలు పూర్తిగా వున్నా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను పక్కనపెడుతూ కేవలం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించే కేంద్ర ఏజెంట్లుగా వుండటమే అందుకు ప్రధాన కారణం.
అయితే గవర్నర్లు ఈ తరహాలో వివాదాల పాలవ్వడం కొత్తే విషయమేమీ కాదు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడూ గవర్నర్ వ్యవస్ధను పూర్తిగా దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసిందనే ఆరోపణలు పాతవే. ఐతే అవే తరహా వివాదాలు ఇటీవల మరింతగా పెరుగుతుండటమే ఆందోళన కలిగించే పరిణామం. సమాఖ్య వ్యవస్థలో కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ప్రాధాన్యత కలిగివుంటాయనీ.. స్ధానికంగా తీసుకునే అనేక నిర్ణయాలు ప్రజలద్వారా ఎన్నుకోబడ్డ అధికార ప్రభుత్వాలే తీసుకోవాలి తప్ప కేంద్రం చే నామినేట్ చేయబడిన గవర్నర్లు వాటిని రూలౌట్ చేయడం ప్రజాస్వామ్య స్పూర్తిని కాలరాయడమే అనే అభిప్రాయాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాల్లోనే గవర్నర్ల వ్యవహార శైలి వివాదస్పదంగా వుంటోంది.
కేరళ, తమిళనాడు గవర్నర్లు
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్బంగా క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగ ప్రతిలోని కొన్ని భాగాలను గవర్నర్ ఆర్.ఎన్. రవి చదవకుండా వదిలేయడం, దీనిపై సీఎం సహా అధికార పక్షం అభ్యంతరం తెలిపడం తాజా చర్చకు దారితీసింది. దీనిపై గవర్నర్ కార్యాలయాల వర్గాలు ఇచ్చినట్టుగా చెప్తున్న వివరణ మరింత అభ్యంతరకరం. ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్ కాపీలో డీఎంకే ప్రభుత్వ సైద్దాంతిక ధోరణులు జొప్పించారు అందుకే వాటిని చదవకుండా వదిలేసారట. దాంతోపాటు తమిళనాడు రాష్ట్రం పేరునే మార్చుకోవాలని ఆయన సూచించడం పట్ల కూడా అనేక అభ్యంతరాలు ఎదురయ్యాయి. రాజ్ భవన్ లో జరిగే సంక్రాంతి వేడుకల ఆహ్వానంలో కూడా జాతీయ చిహ్నం మాత్రమే పెట్టి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నానికి స్ధానం కల్పించలేదు. ఇలా తమిళుల అయిష్టతను మూటగట్టుకోవడమే కాదు కేంద్ర రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తితే కేంద్రం పక్షానే నిలవాలని ఆయన అధికారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారట కూడా.
ఇది ఇలా వుంటే పొరుగురాష్ట్రమైన కేరళ గవర్నర్ తో అక్కడి ప్రభుత్వం వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర క్యాబినెట్ నుంచి ఓ మంత్రిని తొలగించాలని గవర్నర్ సీఎం కి సూచించడం. ఆ మంత్రి ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించడం మొదలు రాష్ట్ర ప్రభుత్వం వివిధ యూనివర్సిటీలకు నియమించిన వైస్ ఛాన్సిలర్ల నియామకం చెల్లదంటూ వారిని రిజైనే చేయాలని ఆదేశించడం రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను ప్రశ్నించడమే. ఈ అంశంలో విశ్వవిద్యాలయాల ఛాన్సిలర్ హోదాలో తనకు ఆ అధికారముంటుుందని గవర్నర్ ఖాన్ చెప్పడంతో అసలు గవర్నర్ యునివర్సిటీల ఛాన్సిలర్ గా వ్యవహరించే హోదానే తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఇదే విధానాన్ని తెలంగాణ కూడా అనుసరించబోతోంది.
ఉత్తరాదినా గవర్నర్లపై గరంగరం
ఇది కేవలం ఇక్కడికే పరిమితం కాలేదు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింఘ్ కోషియారి అక్కడ బీజేపీ భాగస్వామ్యంతో ఏకనాథ్ షిండే ప్రభుత్వం ఏర్పాటు క్రమంలో వ్యవహరించిన తీరు. ఆయన పార్టీ మరో పార్టీలో విలీనం కాకుండానే వారి ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా గుర్తించడంతో వివాదం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. ఎగువ సభకు సభ్యులను నామినేట్ చేసే విషయంలోనూ అప్పటి శివసేన సర్కారు చేసిన సిఫారసులను పక్కన పెట్టడం ద్వారా లేని అధికారాలను తన చేతుల్లోకి తీసుకుని రాజకీయంగా బీజేపీ మనిషిలా వ్యవహరించారన్న వివాదాన్నీ మూటగట్టుకున్నారు. ఇది మాత్రమే కాదు ఢిల్లీ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కూ అక్కడి ఆమ్ ఆద్మీ పార్టీకి రోజూ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో రోజూ జోక్యం చేసుకోవడం ద్వారా తాము విఫలం చేందామని సూచించే ప్రయత్నం లెఫ్టినెంట్ గవర్నర్ చేస్తున్నారని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. అధికారుల బదిలీల నుంచి పోలీసుల నియామకం, ప్రభుత్వ నిర్ణయాలను అమలు కాకుండా పెండింగులో పెట్టిన ఆరోపణలూ కేవలం ఢిల్లీలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ జరిగాయి.
తెలంగాణలో రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్.
తెలంగాణలో ముఖ్యమంత్రి కార్యాలయానికీ గవర్నర్ కార్యాలయానికీ రోజురోజుకూ దూరం పెరుగుతోంది. హుజూరాబాద్ ఎన్నికకు ముందు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించాల్సిందిగా రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసిన పంపినా చేయడం చేయకపోవడం తన అధికారపరిధిలోకి వస్తుందంటూ గవర్నర్ తమిళిసై దీర్ఘకాలం పాటు వాయిదా వేస్తూ రావడం వివాదానికి కేంద్రబిందువైంది.
రాష్ట్ర క్యాబినెట్ సలహా మేరకే నిర్ణయం తీసుకోవాల్సిన గవర్నర్ రాజకీయంగా వ్యవహరిస్తున్నారంటూ టీఆర్ఎస్ నాయకులు విమర్శిలు కూడా చేశారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా వెంటనే నివేదికలు కోరుతూ సమాంతర వ్యవస్తను నడిపే ప్రయత్నంచేస్తున్నారని వారి ఆరోపణ. ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన ప్రభుత్వ అధికారాలను చిన్నచూపు చూస్తున్నారనీ, శాంతి భద్రతల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే ఐనా ప్రతి అంశంలోనూ పోలీసుల నుంచి నివేదికలు కోరడం. ప్రజల నుంచి తానే స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తానంటూ చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను చులకనచేయడమే.. దాని వెనుక ఆమె రాజకీయ నేపథ్యమే ప్రధాన కారణమని టీఆరెస్ ఆరోపణలు చేసింది. ఇలా పెరిగిన విభేదాలు ఇప్పుడు తారా స్దాయికి చేరాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండా గవర్నర్ ప్రసంగించే సందర్భాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు.
మహిళనైన నన్ను అవమానపరిచే విధంగా అధికారులు కనీస ప్రొటోకాల్ కూడా పాటించకుండా ప్రోత్సహిస్తున్నారని కూడా తమిళిసై ఆరోపించారు. దీంట్లో వాస్తవంకూడా లేకపోలేదు. కానీ అవన్నీ రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్ నెరిపే సత్సంబందాలపై మర్యాదలు ఆధారపడి వుంటాయనీ టీఆరెస్ నాయకులు పరోక్షంగా చెప్తున్నారు. గత గవర్నర్ నరసింహన్ కాంగ్రెస్ హయాంలో నియమితులైనా వారిని అన్ని విధాలా గౌరవించామని టీఆరెస్ చెప్పడం వెనక ఈ సమస్యకు పరిష్కారం దాదాపూ అసాధ్యమని చెప్పకనే చెప్పినట్టు.
రాష్రపతి కంటే గవర్నర్ కే విచక్షణాధికారాలు ఎక్కువ.
పళనిస్వామి తమిళనాడు సీఎంగా చేసిన రాజీనామాపై నిర్ణయాన్ని చాలారోజులు వాయిదావేసినా, మహారాష్ట్ర కర్నాటకల్లో బీజేపీ నాయకులచే ఆకస్మింకంగా ప్రమాణస్వీకారాలు చేయించినా, ఫ్లోర్ టెస్టులకు ఆదేశాలిచ్చినా అన్నీ వివాదాస్పదాలయ్యాయి. ఎప్పుడు ఏ గవర్నర్ నిర్ణయం వివాదమైనా గవర్నర్లు ఇచ్చే వివరణ నేను నా విచక్షణాధికారం మేరకు నడుచుకున్నానని చెప్పడం. అసలు గవర్నర్లుంకుండే ఈ విచక్షనాధికారం సాక్షాత్తూ దేశ రాష్ట్రపతికి కూడా లేదని కొందరు వివరిస్తున్నారు.
క్యాబినెట్ సలహా సూచనలమేరకే రాష్ట్రపతి నిర్ణయాలు ప్రకటిస్తుంటారు. కానీ రాష్ట్రాల గవర్నర్లకుండే ఈ విచక్షణాధికారాల అసలు నిర్వచనం పక్షపాతంగా వ్యవహరించడం కాదని మరికొందరి విశ్లేషన. గవర్నర్ల ప్రమాణస్వీకారంలో కూడా ప్రిజర్వింగ్, ప్రొటెక్టింగ్ అండ్ డిఫెండింగ్ ద కాన్టిట్యూషన్ అని వుంటుంది అంటే రాజ్యాంగ పరిరక్షకులుగా వారి బాధ్యత ఏంటే చాలా స్పష్టంగా చెబుతోంది. కానీ అలా అని విచక్షణాదికారాన్ని ఏ సందర్భంలో వినియోగించుకోవాలో రాజ్యాంగ రూపకల్పన సమయంలో జరిగిన చర్చలు పరిశీలిస్తే తెలుస్తుంది. ప్రత్యేక పరిస్తితుల్లో తీసుకునే ఆ నిర్ణయాల అసలు అర్ధం మాత్రం రాజకీయం కాదని స్పష్టమౌతుంది. అంతిమంగా గవర్నర్ నామినేట్ అయిన వ్యక్తి, ప్రభుత్వం ఎన్నుకోబడిన వ్యవస్ధ అన్న పరమార్ధం తెలుసుకోవడం అవసరం.
Pradeep Kumar Bodapatla
Input Editor, TV5
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com