Godavari Flood Alert : గోదావరి ఉధృతి....లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనితో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజీ నుండి సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి ఈ నీటి ప్రవాహం 14 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 14.10 అడుగులకు చేరుకుంది.
లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు
గోదావరి నది పాయలైన వశిష్ఠ, వైనతేయ, గౌతమి నదీ పాయలు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనితో పి. గన్నవరం మండలంలోని నాలుగు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామ ప్రజలు రాకపోకల కోసం మరపడవలను ఉపయోగిస్తున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో తహసీల్దార్ ఆయా గ్రామాల్లోని విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. వరద ప్రవాహం ఇంకా కొనసాగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అధికారుల సూచనలను పాటించాలని కూడా వారు కోరారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com