Let's Vote: ఆదమరిచారా ఓటు గోవిందా....

hyderabad
Lets Vote: ఆదమరిచారా ఓటు గోవిందా....
2023 ఈసీ కొత్త ఓటరు జాబితా ప్రకారం ఏపీలో 7.51 లక్షల ఓటర్లు తగ్గుదల.... కారణమేంటి...!


2023 ఈసీ కొత్త ఓటరు జాబితా ప్రకారం ఏపీలో 7.51 లక్షల ఓటర్లు తగ్గుదల.

తెలంగాణలోనూ 3.79 లక్షల ఓట్ల తగ్గుదల.

కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నప్పటికీ .

రెండు రాష్ట్రాల్లో కలిపి 11 లక్షల ఓట్లు తగ్గడమేంటి.

బోగస్ ఓట్లు తొలగిస్తే సరే కానీ అర్హుల ఓట్లు పోతే పరిస్థితి ఏంటి.

ఓటర్ లిస్టులో మీ ఓటును సరిచూసుకోండి.

కొత్త ఓటర్లను జాబితాలో చేర్చండి.

అడ్రస్ మారినా నియోజకవర్గం మారినా వెంటనే ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేసుకోండి.

ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యేదాకా మీ ఓటు వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీదే.

ఎన్నికల కమిషన్ ప్రతి ఏడాది ప్రకటించే ఓటర్ల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గడం ఆసక్తి రేపుతోంది. ఈ జనవరి 5తేదీన ప్రకటించిన స్పెషల్ సమ్మరీ రివ్యూ 2023 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 4,07,36,279 నించి 3,99,84,968 కి తగ్గింది. అంటే ఏడున్నర లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిపోయాయి. అది కూడా ఈ ఏడాది కాలంలో కొత్తగా ఓటు వయసు వచ్చిన మూడు లక్షల మంది తమ ఓట్లను నమోదు చేసుకున్న తర్వాత ఈ తగ్గుతల కనిపించడం ఆసక్తిని రేపుతోంది. పోనీ హైదరాబాదు నగరానికి యువత వలస పోవడం ద్వారా ఇలా జరిగిందా అనుకుంటే తెలంగాణలోనూ నూతన ఓటరు జాబితాలో తగ్గుదల కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 2022 జనవరి వరకు తెలంగాణలో ఉన్న 3.03 కోట్ల ఓట్లు తాజా జాబితా ప్రకారం 2.99కోట్లకు పడిపోయాయి అంటే అక్కడ కూడా 3,80,000 ఓట్లు తగ్గిపోయాయి. బోగస్ ఓట్ల తొలగింపు, డూప్లికేషన్ లు సవరించడం లాంటి చర్యల వల్ల ఈ తగ్గుదల కనిపిస్తుందని ఎన్నికల కమిషన్ అధికారులు చెబుతున్నారు.

అనుమానాలెన్నో... ఫారం 7 రెండు వైపులా పదునున్న కత్తి



నిబంధనలమేరకు ఓటరు జాబితా మార్పుచేర్పులుంటే తప్పుపట్టాల్సిన అవసరం లేదు.. కానీ అకారణంగా లేదా పార్టీల కుట్రల వల్ల ఓటు కోల్పోయే అవకాశాలూ వున్నాయి. ఇటీవల పరిణామాలు అందుకు ఊతమిస్తున్నాయి. చనిపోయిన లేదా అనర్హుల పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నట్టయితే అవి తొలగించేందుకు ఫారం సెవెన్ వినియోగిస్తారు. ఇది ఓటర్ మాత్రమే కాదు బయట వారు కూడా ఈ అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. అందుకే ఈ వెసులుబాటును రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేసిన ఆరోపణలొచ్చాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి పార్టీలు తమ ఓట్లను ఫారం-7 ద్వారా తొలగించారన్న ఆరోపణలు ఒకరిపై ఒకరు చేసుకున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో 30000 నకిలీ ఓట్లు ఉన్నాయన్న అసత్య ప్రచారం చేస్తూ వైఎస్ఆర్సిపి నాయకులు ఫామ్-7 ద్వారా వాటిని తొలగించేందుకు కుట్రపన్నుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకే ఓటు నమోదు చేసుకున్నాకూడా ఈ ఫామ్-7 ద్వారా ఎవరైనా ఆ ఓటును తొలగించే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తమ ఓట్లను తొలగించారంటూ ఆంధ్ర ప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీలిరువురూ గగ్గోలు పెట్టిన విషయం తెలిసింది. తెలంగాణలోనూ జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలోనూ, 2018 అసెంబ్లీ ఎన్నికల అప్పుడూ ఈ ఓట్ల తొలగింపు పెద్ద దుమారం రేపింది. అధికార పార్టీలు ఎన్నికల అధికారుల ద్వారా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ప్రతిపక్షాలు కూడా కుట్రపూరితంగా తమ ఓటర్లను తగ్గించేందుకు ఫామ్-7 ను దుర్వినియోగ పరిచాయన్న ఆరోపణలు చేశాయి. ఏది ఏమైనా ఎన్నికల రోజున ఓటర్ లిస్టులో మన పేరు కనపడకపోతే అది మన బాధ్యతారాహిత్యంగానే పరిగణించాలి. ఓటు వేసే సామాజిక బాధ్యత మనదే.. అందుకే చివరి రోజు దాకా వెయిట్ చేయకుండా ముందుగానే మన ఓటు జాబితాలో ఉందో లేదో, ఏ అడ్రస్ పైన నమోదైంది, ఏ నియోజకవర్గంలో మనం ఓటు వేయాలి, ఇంట్లో కొత్తగా ఓటు వయసొచ్చిన యువతకు ఓటు హక్కు నమోదు చేయాల్సిన బాధ్యత మనదే.

ఎలా వెరిఫై చేసుకోవాలి...

మన ఓటు ఎక్కడ నమోదయింది తెలుసుకునేందుకు ఎన్నికల కమిషన్ పలు సదుపాయాలు ఏర్పాటు చేసింది. electoralsearch.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మన ఓటు వెరిఫై చేసుకోవచ్చు. లేదా ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ 1950 కి ఫోన్ చేసి మరీ మన ఓటు స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇంకా తేలికగా 1950 కి మన ఓటర్ ఐడీ కార్డు నెంబరు ఎస్ఎంఎస్ చేసి కూడా మన ఓటు స్టేటస్ సులభంగా కనుక్కోవచ్చు.

ఓటు నమోదు చేసుకోవడం ఎలా.

పెరుగుతున్న ఇంటర్నెట్ అందుబాటు వంటి ఆధునిక సదుపాయాలు దృష్టిలో పెట్టుకొని ఓటు నమోదు ప్రక్రియను ఎన్నికల కమిషన్ మరింత సులభతరం చేసింది. ఇంట్లో కూర్చుని మనం మన ఓటును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మన ఓటు రిజిస్ట్రేషన్ కి అప్లై చేయవచ్చు. లేదా eci.gov.in అనే వెబ్ సైట్ లో కూడా మన ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇది కూడా చేయలేనివారు ఆఫ్లైన్లోనూ ఓటును నమోదు చేసుకోవచ్చు. స్థానిక ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి లేదా ఉప అధికారి కార్యాలయంలో లభించే ఫామ్ 6లో మన వివరాలు భర్తీ చేసి పోస్ట్ ద్వారాకానీ నేరుగాకానీ ఇవ్వడం ద్వారా ఓటు రిజిస్ట్రేషన్ కి దరఖాస్తు చేయొచ్చు.

ఏ ఫారంతో దరఖాస్తు చేయాలో తెలిస్తే సులువే...



ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో 6, 6A,7, 8, 8A వంటి వివిధ ఫార్మ్స్ అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ఏ ఫారం ఎందుకు వినియోగించాలో తెలుస్తే మన ఓటు నమోదు చేసుకోవడంతో పాటు అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు, తప్పులను సరిచేసుకోవచ్చు. ఫామ్-6 ద్వారా కొత్త ఓటర్లు ఓటు నమోదు చేసుకోవడం లేదా నియోజకవర్గ పరిధిదాటి అడ్రస్ మారితే కొత్త చోట ఓటుకు దరఖాస్తు ఇవ్వడం చేయొచ్చు. ఎన్నారై ఓటర్లు కూడా ఓటు నమోదు చేసుకునేందుకు ఫామ్-6A ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫామ్ 8 ద్పారా పేరు, వయసు, ఇతర వివరాల తప్పుల సవరణకు దరఖాస్తు చేయొచ్చు. 8A ద్వారా మనము ఉన్న నియోజకవర్గంలోనే మరో చోటుకి అడ్రస్ మారితే కొత్త అడ్రస్ ఎన్నికల కమిషన్ దగ్గర నమోదు చేయవచ్చు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే వరకే కొత్త ఓటర్లను నమోదు చేస్తారు. ఈలోగా జాగ్రత్తపడకపోతే ఎన్నికల్లో ఓటేసే అవకాశం కోల్పోతారు. మనకు పడే ప్రతీ ఓటూ కీలకమనే రోజులు మారి ప్రత్యర్ధి ఓట్లను తగ్గించే ప్రయత్నాలు ముమ్మరమవుతున్న ప్రస్తుత అవాఛనీయ వాతావరణంలో ఏమరపాటుగా వుంటే మీఓటు హుళక్కే అన్న విషయం గుర్తెరిగి నడుచుకోండి. ఓటింగా అనే ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కండి.

Tags

Read MoreRead Less
Next Story