Pamban Bridge : రామేశ్వర ద్వీపాన్ని కలిపే పంబన్ బ్రిడ్జి విశేషాలు ఇవే

Pamban Bridge : రామేశ్వర ద్వీపాన్ని కలిపే పంబన్ బ్రిడ్జి విశేషాలు ఇవే
X

తమిళనాడు రామేశ్వరం ద్వీపాన్ని.. ప్రధాన భూభాగంతో కలిపే కొత్త పంబన్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. పాత రైల్వే వంతెన ప్రమాదకరంగా మారడంతో మూసివేశారు. దాని స్థానంలో కొత్తగా రైల్వే వంతెన నిర్మించారు. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ సైతం విజయవంతమైంది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్‌ లిఫ్ట్‌ బ్రిడ్జిని సముద్రం మధ్యలో నిర్మించారు. కొత్త పంబన్‌ బ్రిడ్జిని 17 మీటర్ల ఎత్తులో రూ.550 కోట్లతో నిర్మించారు. తమిళనాడులోని రామేశ్వరం మండపం జిల్లా పట్టణం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవికి వెళ్లాలంటే.. కేవలం సముద్రం మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రెండు ప్రాంతాలను సముద్ర మార్గాన్ని లింక్‌ చేసేలా పంబన్‌ రైల్వే వంతెనను నిర్మించారు. అవసరానికి అనుగుణంగా లిఫ్ట్‌ చేసేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సిబుల్‌ బ్రిడ్జి ఇది. దేశంలోనే తొలి వర్టికల్‌ బ్రిడ్జి ఇది. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు.

పాంబన్ వంతెన సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. వంతెన కింద నుంచి ఓడలు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంది. వంతెనకు రెండువైపులా భారీ స్తంభాలుంటాయి. వంతెనను ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద లిఫ్ట్‌లు, మోటార్ల సాయంతో పైకి లేస్తుంది. కొత్త వంతెనకు తుప్పు సమస్య రాకుండా మూడు పొరల పాలీసిలోక్సేన్‌ పెయింట్‌ వేశారు. దాంతో దాదాపు 58 సంవత్సరాల వరకు తుప్పు ముప్పు ఉండదు. చిన్న చిన్న మరమ్మతులు చేస్తే వందేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Tags

Next Story