Bhogi Festival : భోగి ప్రత్యేకత ఇదే.. ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ. నాలుగు రోజుల పండుగగా జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు భోగి. హిందూ సంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ముందు వచ్చే రోజును భోగి పండుగగా ఘనంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేస్తారు. అదే విధంగా చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును జరుపుతారు. గడిచిన దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలను కొత్త సంవత్సరంలో ఉండకూడదని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. శాస్త్రీయ పరంగా చూస్తే సూర్యుడు దక్షిణయానంలో భూమికి దూరంగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధల నుంచి తప్పించుకునేందుకు కూడా భోగి మంటలు వేస్తారు
శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా ఈ భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు భోగి రోజు అని అందుకే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి పండుగగా జరుపుకోవడం సంప్రదాయంగా మారిందని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com