Youtube Shorts : యూట్యూబ్ షార్ట్స్ నిడివి పెంపు .. మూడు నిమిషాల వరకు చాన్స్

ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తన షార్ట్స్‌లో కీలక అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇకపై కంటెంట్ క్రియేటర్లు మూడేసి నిమిషాల నిడివి గల వీడియోలను అప్‌లోడ్ చేసుకునే వెసులు బాటును తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి ఈ మార్పు రానుంది. దీంతో కంటెంట్ క్రియేటర్లు తమ కంటెంట్‌తో యూజర్లకు మరింత చేరువ కావడానికి వెసులుబాటు కలగనుంది. యూట్యూబ్ షార్ట్స్‌ను తీసుకొచ్చిన కొత్తలో కేవలం 60 సెకన్లలోపు వీడియోలపై మాత్రమే యూట్యూబ్ దృష్టిసారించింది. ఓ విధంగా టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లకు పోటీనివ్వడంలో ఇది యూట్యూబ్‌కు సహాయపడింది. ఈ క్రమంలో కంటెంట్ క్రియేటర్ల నుంచి విజ్ఞప్తుల మేరకు తాజాగా నిడివిని మూడు నిమిషాలకు పెంచేందుకు నిర్ణయించింది. నిడివి కలిగిన షార్ట్స్‌ను యూజర్లు పొందేలా తన రికమెండేషన్ సిస్టమ్‌లో మార్పు చేయనుంది.దీంతో పాటు కంటెంట్ క్రియేషన్‌కు సంబంధించి మరికొన్ని కొత్త ఫీచర్లను యూట్యూబ్ ప్రకటించింది. కొత్తగా టెంప్లేట్ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ట్రెండింగ్ వీడియోలను ‘రీమిక్స్ బటన్’ ద్వారా కొత్త వీడియోగా రీ క్రియేట్ చేయొచ్చు. ట్రెండింగ్, పాపులర్ వీడియోలకు పర్సనల్ టచ్ ఇవ్వడంలో కంటెంట్ క్రియేటర్లకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. అలాగే, యూట్యూబ్ కంటెంట్‌ను షార్ట్స్‌గా మలిచేందుకూ రాబోయే కొన్ని నెలల్లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com