Health Benefits : దానిమ్మ పండుతో ఆరోగ్యానికి ఎంతో మేలు

ప్రకృతి ఇచ్చే ఏ ఆహార పదార్థం అయినా మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదే అవుతుంది. ముఖ్యంగా అందులోనూ పండ్లది ప్రత్యే్క స్థానం. సీజనల్ ఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎవరైనా ఫిట్‌గా ఉండవచ్చని వైద్యులు అంటారు. ఈకాలంలో ఎక్కువగా వచ్చే దానిమ్మ వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దానిమ్మను రోజూ తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. ఇది టైప్ 2 డయాబెటీస్, ఊబకాయం నుండి మనిషిని కాపాడుతుంది. అంతే కాకుండా దానిమ్మ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుంది. ఇవన్నీ మనకు ముందుగా తెలిసిన ప్రయోజనాలే కానీ చాలామందికి తెలియని మరిన్ని ప్రయోజనాలు కూడా దానిమ్మ వల్ల కలుగుతాయి.
ఆరోగ్యపరంగానే కాదు శారీరకంగా కూడా దానిమ్మ చాలారకాలుగా మంచిది. ముఖ్యంగా దానిమ్మ వల్ల చర్మసౌందర్యం కూడా పెరుగుతుంది. చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచటం మరియు అందాన్ని మెరుగుపరచడం దానిమ్మ వల్ల కలిగే లాభాలు. వివిధ రకాల చర్మ వ్యాధులను తగ్గించడానికి కూడా దానిమ్మ ఉపయోగపడుతుంది. దానిమ్మలో ఉండే నూనెలు, బాహ్యచర్మ కణాలకు శక్తిని అందించి, చర్మంపై ముడతలు పడకుండా చూస్తాయి. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పండులోని బాహ్య పొర.. చర్మంలోని ఎపిడెర్మల్‌లో రక్త ప్రసరణను అధికం చేసి, ప్రమాదానికి గురైన కణాలను తొలగించి, నూతన కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
వృద్ధాప్యాన్ని ఆపే ఆహార పదార్థాల్లో దానిమ్మ ముఖ్యమైంది. సూర్యకిరణాలకు బహిర్గతం అవటం వల్ల కలిగే ప్రమాదాలను, ముడతలను దానిమ్మ నివారిస్తుంది. అలాగే దానిమ్మ పండులో ఉన్న ప్యూనిక్ ఆమ్లం, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మం పొడిబారడాన్ని, తేమను కోల్పోవటాన్ని నివారిస్తాయి. దానిమ్మ పొడి చర్మానికే కాదు జిడ్డు చర్మానికి కూడా ఉపయోగపడుతుంది. జిడ్డు చర్మంపై కలిగే మొటిమలను, చర్మ పగుళ్లను, మచ్చలు మరియు దురదలను శక్తివంతంగా తగ్గిస్తుంది. దానిమ్మ పండులో ఉండే 'ప్యూనిక్ ఆసిడ్', చర్మ కణాల్లో ఉండే బ్యాక్టీరియా, మలిన పదార్థాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com