ఉల్లి ధర అక్కడలా.. ఇక్కడిలా

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు.. కానీ ఆ ఉల్లి ఇప్పుడు భారతీయ రైతులను కన్నీరు పెట్టిస్తోంది. వ్యాపారులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. ఎండనక, వాననక ఇంటిలిపాది కష్టం చేసి ఉల్లి పంటను పండిస్తే చివరకు పెట్టుబడులు కాదు కదా కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉల్లి ధరలు రైతులు, కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బ్రిటన్, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్, అజర్‌బైజాన్,టర్కీ దేశాల్లోఉల్లి ధరలు ఆకాశాన్నిఅంటుతుండగా... మన దేశంలో మాత్రం కిలోకు రూపాయి కూడా రాక రైతులు రోడ్లపై పారబోస్తున్న విచిత్ర పరిస్థితి నెలకొంది.
ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తోడు వాతావరణంలో మార్పులతో పలు దేశాల్లో కూరగాయలు, నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. అనేక ప్రభుత్వాలు వాటిని నియంత్రించలేక ఆపసోపాలు పడుతున్నాయి. మొరాకో,టర్కీ,కజక్‌స్థాన్‌లు ఎగుమతులు ఆపేశాయి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచబ్యాంకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉల్లి కొరతపై హెచ్చరించాయి. ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, ఒక క్యారెట్, ఒక ఆలు... అంటూ వినియోగదారులు కొంటుంటే కడుపు తరుక్కుపోతోంది. ఇక ఫిలిప్పీన్స్‌లో మాంసం కంటే ఉల్లి ధర ఎక్కువగా ఉంది. కిలో ఉల్లి పన్నెండు వందల ధర పలుకుతోంది. అంతపెట్టినా దొరికే పరిస్థితి లేదు. విదేశాల నుంచి వచ్చేవారు విమానాల్లో ఉల్లిగడ్డలను దొంగతనంగా తెచ్చుకుంటున్నారు. ఉల్లి స్మగ్లింగ్‌పై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉజ్బెకిస్థాన్, తజిక్‌స్థాన్, అజర్‌బైజాన్, బెలారస్‌ల్లోనూ ఇదే పరిస్థితి.
మరోవైపు ప్రపంచమంతా ఉల్లి వెంట పడుతుంటే.. మన దేశంలో పండించిన పంటకు ధరలేక రైతులు ఉల్లిని రోడ్లపై పారేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి వ్యాపార కేంద్రంగా పేరొందిన నాసిక్ ప్రాంతంలో కిలో ధర రూపాయి లేదా రెండు రూపాయలు మాత్రమే పలుకుతోంది. సాధారణంగా మహారాష్ట్రలో ఉల్లి రైతులు మూడుసార్లు... ఖరీఫ్,రబీ లలో పంటలు వేస్తారు. ఖరీఫ్ పంటను జనవరిలో అమ్ముతారు. తర్వాతి పంటను మే, జూన్‌లలో మార్కెట్‌లోకి తెస్తారు. ఈసారి ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు కాస్త పెరగటంతో పంట పాడవుతుందనే భయంతో ఖరీఫ్ తర్వాత వేసిన పంటను కూడా తొందరగా మార్కెట్లోకి తేవటంతో సరఫరా పెరిగిపోయింది. దీంతో ధర పడిపోయింది. నిల్వచేసుకునే సదుపాయాలు ఎక్కువగాలేకపోవటం రైతులకు ఇబ్బందికరంగా మారింది.దీంతో మన ఉల్లి రైతుల కళ్లలోకన్నీళ్లు తెప్పిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com