ఏడాదిన్నర తర్వాత మోదీ విదేశీ పర్యటన..

ప్రధాని నరేంద్రమోదీ... అమెరికాలో ఐదు రోజుల పర్యటన కోసం ఢిల్లీ నుంచి ఎయిరిండియా ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రధాని మోదీ విదేశీ పర్యటన చేస్తున్నారు. అమెరికా పర్యటనలో మోదీ... క్వాడ్ సదస్సులో పాల్గొంటారు. భారత్, అమెరికాలతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ అధినేతలు క్వాడ్ సదస్సుకు హాజరవుతారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో మోదీ సమావేశం కానున్నారు.
ఈనెల 24న వైట్‌హౌస్‌లో ఇరుదేశాధినేతలు భేటీ అవుతారని అమెరికా అధ్యక్ష భవనం వెల్లడించింది. భారత – అమెరికా ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చించనున్నారు. అలాగే, ఆఫ్గానిస్తాన్‌లోని ప్రస్తుత పరిస్థితులు, కొవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ అమెరికాకు వెళుతుండటం ఇదే మొదటి సారి. రేపు ఉదయం ప్రధాన మంత్రి మోదీ, అమెరికాలోని ప్రధాన CEO లతో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆపిల్ చీఫ్ టిమ్ కుక్, ఇంకా యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com